అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనను పదవి నుంచి తప్పించేందుకు ప్రతిపక్ష డెమోక్రాట్లు దిగువ సభలో అభిశంసన తీర్మానం గతేడాది డిసెంబరులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన అభిశంసన తీర్మానం సెనెట్‌లో మాత్రం వీగిపోయింది. దీంతో ట్రంప్‌నకు పదవీగండం ముప్పు తప్పింది. రిపబ్లికన్లు అధిపత్యం ఉన్న సెనేట్‌లో ప్రవేశపెట్టిన తీర్మానంపై బుధవారం ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా 48 మంది ఓట్లు, వ్యతిరేకంగా 52 మంది ఓటువేశారు. దీంతో అధికార దుర్వినియోగం, కాంగ్రెస్‌ను అడ్డుకోవడం అనే రెండు అభియోగాలపై సెనేట్‌లో అభిశంసన ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్‌కు విముక్తి లభిచింది. అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఆరోపణలపై 52-48 ఓట్లు, కాంగ్రెస్‌ను అడ్డుకోవడంపై 53-47 ఓట్లు వేశారు. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమొక్రాట్ల తరఫున పోటీచేయనున్న జోబిడెన్‌పై దుష్ప్రచారం చేయాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణకు ఆదేశించిన ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ.. అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. దీనికి అనుకూలంగా 230 ఓట్లు, వ్యతిరేకంగా 197 ఓట్లు వచ్చాయి. దీంతో డొనాల్డ్ ట్రంప్ సెనేట్‌లో విచారణ ఎదుర్కొన్నారు. అయితే, ఒక రిపబ్లికన్ సభ్యుడు మాత్రం ట్రంప్‌కి వ్యతిరేకంగా వేటువేయడం విశేషం. 2012 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీపడిన మిట్టీ రోమ్నీ ఈ చర్యకు పాల్పడ్డారు. గత మూడేళ్ల కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన ట్రంప్ విధానాలతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకుని, అమెరికా రెండుగా విడిపోయిందని డెమోక్రాట్లు తమ తీర్మానంలో పేర్కొన్నారు. కాగా, అభిశంసన ఎదుర్కొన్న మూడో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. అయితే, 243 ఏళ్ల అమెరికా చరిత్రలో అభిశంసన ద్వారా ఇంత వరకు ఏ అధ్యక్షుడూ తన పదవి నుంచి తప్పుకోలేదు. ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధమవుతోన్న ట్రంప్.. గత ఎన్నికల్లో తన విజయాన్ని ఓర్వలేకే డెమోక్రాట్లు అభిశంసన ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు. తొలిసారిగా 1868లో ఆండ్రూ జాన్సన్, 1999లో బిల్ క్లింటన్‌లు అభిశంసన విచారణ ఎదుర్కొన్న తరువాత పార్టీకి మద్దతునిచ్చారు. రిచర్డ్ నిక్సన్ మాత్రం అభిశంసనను ఎదుర్కోకుండా రాజీనామా చేశారు. తనను తొలగించడానికి సొంత పార్టీ సభ్యులు ఓటు వేస్తారని అనుమానించిన నిక్సన్ పదవి నుంచి తప్పుకున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/39cBL9I
No comments:
Post a Comment