
కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తున్న వేళ.. కేంద్రం మరో షాకింగ్ విషయాన్ని తెలిపింది. దేశంలో కొత్త ‘డబుల్ మ్యుటాంట్ స్ట్రెయిన్’ను గుర్తించినట్లు పేర్కొంది. దీంతో పాటు 771 కరోనా వేరియంట్లను గుర్తించినట్లు ప్రకటించింది. వీటిలో 736 యూకే రకానికి చెందిన వైరస్ కేసులు, 34 సౌతాఫ్రికా రకానికి చెందిన కేసులు, ఒకటి బ్రెజిల్ రకానికి చెందిన వైరస్ ఉన్నట్లు వెల్లడించింది. దేశంలో 18 రాష్ట్రాల్లో కొత్త రకం స్ట్రెయిన్లను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం (మార్చి 24) తెలిపింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు ఈ కొత్త మ్యుటాంట్ (పరివర్తన) వైరస్‌లే కారణమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే.. పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణకు ఈ కొత్త రకం స్ట్రెయిన్‌లే కారణమని చెప్పడానికి మరింత సమాచారం విశ్లేషించాల్సి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. భారత్ కొంత కాలంగా విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల్లో పాజిటివ్ వచ్చిన వారి నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తోంది. ఇందుకోసం ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా ‘ది ఇండియన్ సార్స్-కోవ్-2 కన్సార్టియం ఆన్ జినోమిక్స్ (INSACOG)’ విభాగాన్ని ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 10,787 శాంపిళ్లను విశ్లేషించారు. వీటిలో 736 నమూనాల్లో బ్రిటన్ రకం (B.1.1.7), 34 శాంపిళ్లలో దక్షిణాఫ్రికా (B.1.351) రకం, ఒక నమూనాలో బ్రెజిల్‌కు చెందిన (P.1) రకాన్ని గుర్తించినట్లు వెల్లడైంది. గత డిసెంబర్ నెలలో మహారాష్ట్రలో విశ్లేషించిన నమూనాలతో పోల్చి చూస్తే.. E484Q, L452R మ్యుటేషన్ల నమూనాల్లో బాగా పెరుగుదల కనిపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గతంలో గుర్తించిన మ్యుటేషన్ రకాలతో ఇవి సరిపోలడం లేవని.. రోగనిరోధకతను తట్టుకొని వైరస్ తీవ్రత పెరుగుదలకు ఇలాంటి మ్యుటేషన్లు కారణమవుతాయని కేంద్రం అభిప్రాయపడింది. ఇది ఆందోళన కలిగించే అంశమే. మార్చి 18 నాటికి దేశంలో కొత్త రకం స్ట్రెయిన్ కేసులు మొత్తం 400 నమోదయ్యాయి. కేవలం ఐదు రోజుల వ్యవధిలో ఇది దాదాపుగా రెట్టింపయ్యాయి. దేశంలో కరోనా రెండో వేవ్ కొనసాగుతున్న తరుణంలో కొత్త రకం కేసులు పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగించే విషయం. ఈ కొత్త రకాలకు 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటమే అందుక్కారణం. ఈ నేపథ్యంలో ప్రజలు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. Also Read: ✦ ✦ ✦
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2NRIGjQ
No comments:
Post a Comment