దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వాపిస్తోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 1.41 లక్షల మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. రోజువారీ సగటు పాజిటివిటీ దాదాపు 9 శాతానికి చేరుకుంది. గురువారం ఏడు నెలల తర్వాత తొలిసారి రోజువారీ కేసులు లక్ష (1,17,525) దాటిన విషయం తెలిసిందే. సెకెండ్ వేవ్‌లో గతేడాది జూన్ 6న చివరిసారిగా లక్షకుపైగా కేసులు వెలుగుచూశాయి. శుక్రవారం ఈ సంఖ్య మరింత పెరిగింది. ముందు రోజుతో పోల్చితే రోజువారీ కేసుల పెరుగుదల 21 అధికంగా నమోదుకావడం గమనార్హం. డిసెంబరు 28 నుంచి గత 11 రోజులుగా రోజువారీ కేసుల పెరుగుదల 20 శాతానికిపైగా ఉంది. గత నాలుగు రోజుల నుంచి ఇది 40 శాతానికిపైనే ఉండటం గమనార్హం. కేసుల సంఖ్య పెరుగుతున్నా మరణాలు తక్కువగా చోటుచేసుకోవడం కొంత ఊరటనిచ్చే అంశం. ఇక, మహారాష్ట్రలో ఎప్పటి మాదిరిగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో శుక్రవారం 40,925 కొత్త కేసులు బయటపడగా.. ఒక్క ముంబయిలోనే 21 వేల మంది మహమ్మారి బారినపడ్డారు. అక్కడ దాదాపు ఎనిమిది నెలల తర్వాత రోజువారీ కేసులు 40 వేలు దాటాయి. గురువారం నమోదయిన 36,265 కేసులతో పోల్చితే శుక్రవారం స్వల్ప పెరుగురుదల నమోదయ్యింది. తర్వాత పశ్చిమ్ బెంగాల్‌లో 18,213 కేసులు బయటడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం 17,335 కేసులు నమోదుకాగా పాజిటివిటీ రేటు 17.73 శాతానికి చేరుకున్నట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది. తమిళనాడులో 8,981 కొత్త కేసులు, తెలంగాణలో 2295 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాల్లో ఆంక్షలను మరింత కఠినం అవుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో అక్కడి ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ విధించింది. ఒడిశాలో పూరి జగన్నాథ ఆలయాన్ని జనవరి 10 నుంచి క్లోజ్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం జనవరి 16 వరకూ అన్ని ర్యాలీలను నిషేధించింది. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం ఇప్పటికే వీకెండ్ కర్ఫ్యూ విధించింది.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3t4og9q
0 Comments