కరోనా సోకిందని కొడుకును కారు డిక్కీలో తీసుకొచ్చిన టీచరమ్మ!

కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణతో అగ్రరాజ్యం అమెరికాలో కరోనా సునామీలా విరుచుకుపడుతోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. మరోవైపు, కోవిడ్ పరీక్షల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో టెక్సాస్‌లో ఓ మహిళ కోవిడ్-19 సోకిన తన కుమారుడికి మరోసారి పరీక్షల కోసం కారు డిక్కీలో బంధించి ఆస్పత్రికి తీసుకురావడం కలకలం రేపింది. తనకు కోవిడ్ సోకకుండా ఉండేందుకు ఇలా చేసినట్లు ఆమె చెప్పడం గమనార్హం. టెక్సాస్‌కు చెందిన సారా బీమ్‌ (41) అనే ఓ ఉపాధ్యాయురాలు హారిస్ కౌంటీలోని డ్రైవ్-త్రూ టెస్టింగ్ కేంద్రానికి వచ్చారు. అయితే, ఆమె కారు డిక్కీలోంచి మాటలు వినబడటంతో గమనించిన ఓ మహిళ.. అక్కడున్నవారికి ఈ విషయం తెలియజేసింది. దీంతో వారు బీమ్‌ను నిలదీసి.. కారు డిక్కీని తెరిపించారు. అందులో 13 ఏళ్ల బాలుడు ఉండటంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ బాలుడు తన కుమారుడని.. కరోనా సోకడంతో మరోసారి పరీక్షలు చేయించడానికి తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. అయితే, తనకు వైరస్‌ సోకకుండా ఉండేందుకే కారు డిక్కీలో ఉంచి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. అయితే, బాలుడ్ని కారు వెనుక సీటులో కూర్చోబెట్టే వరకూ టెస్టులు నిర్వహించబోమని అక్కడి సిబ్బంది ఆమెకు తేల్చిచెప్పారు. మరోవైపు, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. ఆమెపై కేసు నమోదుచేశారు. బాలుడి ప్రాణానికి అపాయం కలిగేలా వ్యవహరించారన్న అభియోగాలపై ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు. జనవరి 3న జరిగిన ఈ ఘటనలో అదృష్టవశాత్తు బాలుడికి ఏం కాలేదని పోలీసులు వెల్లడించారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3t4DH1o

Post a Comment

0 Comments