యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగరా.. ఏడు దశల్లో పోలింగ్

ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌పై శనివారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ.. పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీకి పదవీకాలం మార్చితోనూ, ఉత్తర్ ప్రదేశ్‌ అసెంబ్లీకి మే నెలలో ముగుస్తుందని అన్నారు. కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణ సవాల్‌తో కూడుకున్నదని పేర్కొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను సురక్షితంగా నిర్వహిస్తామని చెప్పారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 24.50 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్టు వివరించారు. మహిళా ఓటర్లు పెరిగినట్టు సీఈసీ సుశీల్ చంద్ర పోలింగ్ కేంద్రాలను 16 శాతానికి పెంచామని, ఓటర్ల సంఖ్యను తగ్గించినట్టు పేర్కొన్నారు. ఒక్కో కేంద్రంలో కేవలం 1,250 మంది ఓటర్లకు ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో 2,15,368 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. ఐదు రాష్ట్రాల్లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఏడు దశల్లోనూ.. మణిపూర్‌లో రెండు దశల్లో, మిగతా రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది. మార్చి 10 ఫలితాలను వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 10న తొలి దశ, ఫిబ్రవరి 14న రెండో దశ, ఫిబ్రవరి 20న మూడో దశ, ఫిబ్రవరి 23న నాలుగో దశ, ఫిబ్రవరి 27 ఐదో దశ, మార్చి 3న ఆరో దశ, మార్చి 7న ఏడో దశ పోలింగ్ జరుగుతుంది. రెండో దశలో ఫిబ్రవరి 14న పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. మణిపూర్‌లో ఫిబ్రవరి 27, మార్చి 3న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఏడు దశల్లో యూపీలో పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ వేసే అవకాశం కల్పించినట్టు సీఈసీ పేర్కొన్నారు. క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తే సీటు ఇవ్వడానికి గల కారణాలను ఆయా పార్టీలు వెల్లడించాలని స్పష్టం చేశారు. దోషులుగా ఉండి పోటీచేస్తే గత చరిత్రలను తప్పకుండా తెలియజేయాలని ఈసీ ఆదేశించింది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో ఎన్నికల వ్యయం రూ.40 లక్షలకు పెంచగా.. గోవా, మణిపూర్‌లో రూ.28 లక్షలకు పెంచారు. ఐదు రాస్ట్రాల్లో ఎన్నికల అబ్జర్వర్లుగా 900 మందిని నియమించారు. పోలింగ్ సమయాన్ని గంటకు పెంచారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఉత్తర్ ప్రదే‌శ్‌లో 403, పంజాబ్‌లో 117, ఉత్తరాఖండ్‌లో 70, మణిపూర్‌లో 60, గోవాలో 40 సీట్లకు ఎన్నికల జరగనున్నాయి. ఎన్నికల్లో ప్రలోభాలపై సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. కోవిడ్-19 రోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించినట్టు సీఈసీ పేర్కొన్నారు. పూర్తిస్థాయి టీకా తీసుకున్నవారినే ఎన్నికల విధుల్లో నియమిస్తామని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో జనవరి 15 వరకూ రాజకీయ ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత కోవిడ్ నిబంధనల నడుమే ప్రచారం నిర్వహించాలి. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకూ సభలు, ర్యాలీలకు అనుమతి లేదు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3G79u5y

Post a Comment

0 Comments