‘ఏపీకి జగన్ సీఎం కావడం దండగ.. పొరుగు రాష్ట్రాలకు పండగ’

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 40 రోజుల పాలనపై ప్రతిపక్ష పెదవి విరిచింది. అవినీతి, అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో గడిపిన జగన్ వాటి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శలు గుప్పిస్తోంది. జగన్ సీఎం కావడం ఏపీ దండగైతే పొరుగు రాష్ట్రాలకు పండగైందని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి నిలిపివేయడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌ 40 రోజుల పాలన ప్రజల్లో నైరాశ్యం నింపిందని, రాజధాని అమరావతితో పాటు పోలవరం నిర్మాణ పనులను నిలిపివేశారని మండిపడ్డారు. దీనిపై ప్రశ్నిస్తే గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని జగన్‌తో సహా మంత్రులు వేదాలు వళ్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి, అక్రమాల కేసుల్లో జైలుకెళ్లిన జగన్‌ తనకు అంటిన బురదను చంద్రబాబుకు అంటించాలని తాపత్రయపడుతున్నారని జీవీ ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలను నిలిపివేయడంతో పేదల్లో ఆందోళన నెలకొందని, గ్రామాల్లో రాజకీయ ప్రతీకార దాడులు పెరిగిపోయాయని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు గ్రామాల నుంచి వెళ్లిపోవడం ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట అని మండిపడ్డారు. అసెంబ్లీలో మంత్రుల ప్రవర్తన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. ఇసుక దోపిడీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాటాలు వేసుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక కారణంగా ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య గొడవలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతుందని అన్నారు. శాసనసభలో తండ్రి వయసున్న చంద్రబాబును జగన్‌ బుర్ర... జ్ఞానం ఉందా..అని చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ హిదాయత్‌ ఖండించారు. ఆశా వర్కర్లు, రేషన్‌ డీలర్లు, ఉద్యోగులు అప్పుడే ఆందోళన బాట పడుతున్నారని, సమస్యలు చెప్పుకుందామని వస్తున్న వారిని అకారణంగా అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం విషయంలో ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గడానికి వైసీపీ నిర్వాకమే కారణమని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలే రాజధాని రైతులతో ప్రపంచబ్యాంకుకి ఫిర్యాదులు చేయించారని, ఇకపై రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకీ నిధులిచ్చేందుకు అంతర్జాతీ సంస్థలు ముందుకు రావన్నారు. ఇప్పటికే రాజధానిలో నిర్మాణపనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2M181V9

Post a Comment

0 Comments