ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తమిళనాడులోని తూత్తుకుడిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ తొలుత రోడ్ షో నిర్వహించారు. అనంతరం వీఓసీ కాలేజీలో జరిగిన ముఖాముఖిలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. మోదీపై వాగ్బాణాలు సంధించారు. ప్రధాని పనికొస్తారా, పనికిరారా అనేది ప్రశ్న కాదని, ఆయన ఎవరికి ఉపయోగపడతారు, ఎవరికి ఉపయోగపడరనేదే అసలైన ప్రశ్న అని బదులిచ్చారు. అంతేకాదు ప్రధాని ఆ ఇద్దరు వ్యక్తులకే పూర్తిగా పనికొస్తారని ఎద్దేవా చేశారు. ‘హమ్‌దో మమారే దో’ అనే తరహాలో ఆ ఇద్దరూ మోదీని వినియోగించుకుని తమ సంపదను పెంచుకుంటారు తప్పా పేదలకు ప్రధాని ఏమాత్రం ఉపయోగపడరని వ్యంగ్యంగా అన్నారు. మోదీ తన మిత్రులైన ఇద్దరు బడా పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారంటూ రాహుల్ పలుమార్లు ఇదే తరహా విమర్శలు గుప్పిస్తున్నారు. దేశాన్ని ఏకతాటిపై నిలుపుతున్న ఎన్నికైన వ్యవస్థలు, పత్రికా స్వేచ్ఛపై గత ఆరేళ్లుగా ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతోందని రాహుల్ దుయ్యబట్టారు. దేశంలో ప్రజాస్వామ్యం క్రమంగా మరణశయ్యపైకి చేరుతోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థాగత సమతౌల్యతను ఆర్ఎస్ఎస్ ధ్వంసం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ల అంశంపై రాహుల్ ప్రస్తావించారు. పార్లమెంటుతో పాటు న్యాయవ్యవస్థలోనూ మహిళా రిజర్వేషన్‌కు తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రతి రంగంలోనూ తాము ఎలా రాణించాలని పురుషులు భావిస్తారో అదే విధంగా తమతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ ముందుండాలనే దృక్కోణంతో వారిని చూడాలని అన్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3bGuUsg
No comments:
Post a Comment