Polavaramలో సీఎం జగన్ పర్యటన.. ప్రాజెక్ట్ పనులపై అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం చేరుకున్న జగన్.. ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్‌ను సందర్శించిన జగన్.. పనులను పరిశీలించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్ట్ పరిశీలించిన జగన్.. పనుల పురోగతి, నిర్మాణంపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. కాఫర్ డ్యాం పనులు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద వచ్చే నాటికి పనులు ఎందుకు పూర్తి చేయలేదన్న సీఎం.. ఎక్కువ వరద వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన జగన్.. ముందుగా పశ్చిమ జిల్లాలో ఉండిలో వైఎస్సార్‌ సీపీ నేత కొయ్యే మోషేన్‌రాజు కుమారుని వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ప్రాజెక్ట్ దగ్గరకు చేరుకన్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు. జగన్ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ వెంట ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్.. డిప్యూటీ సీఎం ఆళ్లనాని, జిల్లా ఎమ్మెల్యేలు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంలు ఉన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పోలవరం ప్రాజెక్టుకు తొలిసారి వెళ్లగా.. గతంలో రెండుసార్లు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. 2011 ఫిబ్రవరిలో పోలవరం ప్రాజెక్టుకు హరిత యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలన్న డిమాండ్‌తో ఈ యాత్ర జరిగింది. 2015 ఏప్రిల్‌‌లో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సందర్శన కోసం వైసీపీ ఎమ్మెల్యేలతో బస్సు యాత్ర నిర్వహించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2WPvri5

Post a Comment

0 Comments