
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని గెలుపు వెతుక్కోవాలంటారు పెద్దలు. అదే స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నారు .. ఎన్నికల్లో ఓటమి నేర్పిన పాఠాల నుంచి గెలుపు వైపు అడుగులు వేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి.. ప్రజా సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించే దిశగా ప్రణాళికలు రూపొందించుకునే పనిలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టనున్నారు. ముందుగా తనకు ఓటమి ఎదురైన పశ్చిమగోదావరి జిల్లా నుంచి పర్యటనను ప్రారంభించనున్నారు. విజయవాడలో కార్యాలయంలో అధినేత పవన్ ఆధ్వర్యంలో రాజకీయ వ్యవహారాల కమిటీ తొలిసారి సమావేశమయ్యింది. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణ.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులతో పవన్ చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిని రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. పార్టీ నిర్మాణంలో వ్యక్తిగత అజెండాలకు తావులేదని, పార్టీ కోసం కష్టపడిన వారికి కమిటీల్లో అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికల ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారి జిల్లా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు మొదటి వారంలో పశ్చిమగోదావరి జిల్లాకు వెళుతున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. అదికూడా తాను పోటీచేసిన భీమవరం నియోజకవర్గానికి వెళుతున్నారట జనసేనాని. భీమవరంలో క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. పార్టీ కోసం, పవన్‌కళ్యాణ్ గారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన కొప్పినీడి మురళి అనే కార్యకర్త ఇటీవల మరణించాడు. ఈ విషయాన్ని పార్టీ నేత నాగబాబు అధినేత పవన్ దృష్టికి తీసుకువచ్చారు.. దీంతో పవన్‌కళ్యాణ్ భీమవరంలో మురళీ కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సభ్యులు అధినేత పవన్‌తో చర్చించామన్నారు నాదెండ్ మనోహర్. రాబోయే రోజుల్లో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషిపై చర్చ సాగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల్ని గుర్తించి.. పార్టీ ప్రజలతోనే ఉందనేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, కమిటీల నియామకంలో ఎటువంటి పక్షపాతం లేకుండా నిజమైన జనసైనికులకి అవకాశం కల్పిస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ నిర్మాణం, గెలుపు కోసం ఎంతో మంది కార్యకర్తలు కృషి చేశారన్నారు మనోహర్. జనసేనను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని.. పార్టీ నిర్మాణంలో భాగంగా ప్రతి నేత, కార్యకర్త వ్యక్తిగత అజెండాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం జనసేన ఎల్లవేళలా కృషిచేస్తుందన్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2K9pJ6e
No comments:
Post a Comment