
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పడగవిప్పింది. తనను ఉద్యోగం నుంచి తొలగించారనే ఆకోశ్రంతో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నిందితుడు సహా ఆరుగురు మృతిచెందారు. మిల్‌వాకీ నగరంలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం మెల్సన్ కూర్స్ బీర్ల కంపెనీలో జరిగిన ఈ కాల్పుల ఘటన కలకలం రేపింది. నిందితుడు (51) మెల్సన్ కూర్స్ బీర్ల కంపెనీ మాజీ ఉద్యోగిగా భావిస్తున్నారు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించారనే కక్షతోనే కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాల్పుల జరిపిన సమయంలో వందలాది మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. నిందితుడు తొలుత విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడి తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. కాల్పులు జరిపిన వ్యక్తి సహా మొత్తం ఆరుగురు ఈ ఘటనలో మృతి చెందినట్టు మిల్‌వాకీ మేయర్ టామ్ బార్రెట్ తెలిపారు. నగరానికి ఇది విషాదకరమైన రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. ఘటన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇదో భయంకర చర్యగా పేర్కొన్నారు. మిల్‌వాకీ పోలీస్ చీఫ్ అల్ఫోన్సో మోరల్స్ మాట్లాడుతూ.. కాల్పుల్లో మృతిచెందిన వారంతా మెల్సన్ కూర్స్‌లో పనిచేసే ఉద్యోగులేనని తెలిపారు. ఈ ఘటనపై నగర పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎఫ్‌బీఐ అధికారులు స్పందించిన తీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు. కాల్పుల ఘటనతో సమీపంలోని పాఠశాలు, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. బాధితులు, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని నరహంతకుడిగా అభివర్ణించారు. ఇలాంటి ద్వేషపూరిత, హింసాత్మక ఘటనలను తమ సమాజం క్షమించదని, వీటికి ఇక్కడ తావులేదని విస్కోసిన్ కాంగ్రెస్ సభ్యుడు మైక్ గాలఘర్ వ్యాఖ్యానించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/383Jq9w
No comments:
Post a Comment