జనతా కర్ఫ్యూ లైవ్ అప్‌డేట్స్: ‘ఇళ్లలో ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని రక్షించుకోండి’

కరోనా వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, ఇందుకు ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలు నిర్విరామంగా శ్రమిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ దశలో కరోనా ఎంత ప్రమాదకరమో.. అది ఎలా పంజా విసురుతుందో.. దీన్ని ఎలా ఆపగలమో ప్రతి పౌరుడూ తెలుసుకోవాలని, ఇలాంటి వైరస్‌ల నివారణకు ప్రజల అప్రమత్తత అత్యంత కీలకం అంటున్నారు. మరో స్థాయికి ప్రవేశించిన ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. వైరస్ నియంత్రణలో భాగంగా జనతా కర్ఫ్యూను విజయవంతం చేసి, మహమ్మారిపై పోరాటానికి సహకరించాలని కోరింది. కాగా, ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 285కి చేరుకుంది. గడచిన మూడు రోజుల్లో దేశంలో కొత్తగా 130కిపైగా కేసులు నమోదయ్యాయి. అత్యవసరమైతేనే ఉండే ప్రదేశాల నుంచి సొంతూళ్లకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞ‌ప్తి చేశారు. బస్సులు, రైళ్లలో కిక్కిరిసి ప్రయాణాలు చేస్తే వైరస్ వేగంగా వ్యాపించి మరింత తీవ్రమవుతుందని అన్నారు. వైరస్‌ను అడ్డుకోడానికి అందరూ సహకరించాలని, మేమంతా మీ వెంట ఉన్నామని అన్నారు. మీకోసం, మీ కుటుంబాల కోసం ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. కరోనా వైరస్ ప్రభావం మహారాష్ట్రలో తీవ్రంగా ఉంది . దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. తాజాగా మరో 11 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైరస్‌ బాధితుల సంఖ్య 63కు చేరింది. మహారాష్ట్రలో కరోనా స్టేజ్‌3 దిశగా పయనిస్తోందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని ఆయన తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు దయచేసి బయట తిరగవద్దని కోరారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఏర్పడితే అన్నీ మూసివేసి, 15 రోజులకు సరిపడా రేషన్‌ సరకులు ఇంటింటికీ పంపుతామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. తాను బతికుండగా ప్రజలు నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రానివ్వబోని, అవసరమైతే రూ. పది వేల కోట్ల వరకైనా వెచ్చిస్తానని పునరుద్ఘాటించారు. అత్యవసర విభాగాల్లో పనిచేసేవారికి మినహా ముంబయి లోకల్ రైళ్లలో మార్చి 22 నుంచి 31 వరకు ప్రయాణికులను అనుమతించడంలేదని రైల్వే శాఖ తెలిపింది. ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను అన్ని స్టేషన్లలోనూ తనిఖీ చేస్తామని తెలిపింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2xdLHlK

Post a Comment

0 Comments