కరోనా లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి బ్రింగ్ యువర్ ఓన్ బూజ్ పేరుతో నిర్వహించిన పార్టీలో బ్రిటన్ ప్రధాని వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన పార్లమెంట్ సాక్షిగా ప్రజలకు బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా, బోరిస్ జాన్సన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ భర్త గతేడాది ఏప్రిల్‌లో కన్నుమూయడంతో కోవిడ్-19 కారణంగా ఆయన అంత్యక్రియల్లో అతికొద్ది మంది పాల్గొన్నారు. ఈ అంత్యక్రియలకు కొద్ది గంటల ముందే బోరిస్ జాన్సన్, ఆయన సహచరులు మందు పార్టీ చేసుకున్నట్టు టెలిగ్రాఫ్ పత్రిక ప్రత్యేక కథనం వెలువరించింది. దీంతో రాజకీయ దుమారం రేగుతోంది. బోరిస్ జాన్సన్, అతని క్యాబినెట్ సహచరులు కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి పార్టీని నిర్వహించుకున్నారు. ఈ పార్టీకి సంబంధించిన ఆధారాలు మీడియాలో రావడంతో విపక్షాలు బోరిస్ రాజీనామాకు పట్టుబట్టాయి. దేశ ప్రజలు కరోనా భయంతో ఉన్న సమయంలో ఒక ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి అలా చేయవచ్చా అని నిలదీశాయి. ప్రధాని పదవికి గండం తెచ్చే విధంగా తయారైన పార్టీ విషయంపై బోరిస్ జాన్సన్ దేశ ప్రజలంతా తనను క్షమించాలని కోరారు. ‘2020 మే నెలలో డౌనింగ్ స్ట్రీట్ గార్డెన్‌లో 100 కంటే ఎక్కువ మంది గుమిగూడి పార్టీ చేసుకోవడం పట్ల ప్రజలకు హృదయపూర్వక క్షమాపణలు’ తెలియజేస్తున్నానని అన్నాడు. అయితే, అది విధి నిర్వహణలో భాగంగా జరిగిన కార్యక్రమని నమ్ముతున్నానని జాన్సన్ సమర్ధించుకోవడం విమర్శలకు దారితీసింది. కన్జర్వేటివ్ నేత డగ్లస్ రాస్ మాట్లాడుతూ.. పార్టీ చేసుకున్నట్టు స్వయంగా ప్రధానే ఒప్పుకున్నారని, ఆయనకు పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు. చేసిన తప్పుకు క్షమాపణ కోరితే సరిపోదని ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తే అలా చేస్తే నిబంధనలు ఎవరూ పాటిస్తారంటూ ప్రతిపక్ష పార్లమెంటేరియన్ కార్ల్ టర్నర్ బోరిస్ చర్యలను మరోసారి గుర్తు చేశారు. గతేడాది కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం దేశమంతటా కట్టుదిట్టమైన ఆంక్షల్ని అమలు చేసింది బ్రిటన్. అటువంటి పరిస్థితుల్లోనే 2020 డిసెంబరు 18న ప్రధాని కార్యాలయ సిబ్బంది లాక్‌డౌన్ నిబంధనలను పూర్తిగా అతిక్రమించి క్రిస్మస్ పార్టీ జరుపుకోవడం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3I3Qy89
0 Comments