మాస్క్, కోవిడ్ పాస్‌లు తప్పనిసరికాదు.. రద్దుచేస్తూ బ్రిటన్ సాహసోపేత నిర్ణయం

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్, కోవిడ్ పాస్‌పోర్ట్, తప్పనిసరిగా మాస్క్ ధరించడం వంటి మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ ఈ నిబంధనలను రెండేళ్ల నుంచి అమలు చేస్తున్నాయి. తాజాగా, మాస్క్ ధరించడం, నిబంధనలను తొలగిస్తున్నట్టు యూకే ప్రభుత్వం వెల్లడించింది. సుదీర్ఘకాలం ఇంటి నుంచి పనిచేయాలని చెప్పే అవకాశం ఈ రోజు నుంచి ఉండబోదని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే, వచ్చే గురువారం నుంచి మాస్క్, కోవిడ్ సర్టిఫికేషన్‌ కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ సోకినవారు స్వీయ నిర్బంధలో ఉండాలనే నిబంధనలకు రాబోయే వారాల్లో ముగింపు పలకనున్నట్టు ధ్రువీకరించారు. మార్చి 24తో ఈ చట్టం గడువు ముగియనుండగా.. అంతకు ముందే రద్దుచేసే ఆలోచనలో ఉన్నట్టు జాన్సన్ తెలిపారు. సాధారణ కరోనా కేసులు తగ్గాయని, ఒమిక్రాన్ వేవ్ కూడా గరిష్ఠాన్ని తాకడంతో నిబంధనలను సడలించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌ల వాడకంపై ప్రజల తీర్పుని విశ్వసించాల్సిన సమయం ఆసన్నమైందని, రేపటి నుంచి తరగతి గదులలో మాస్క్ తప్పనిసరి నిబంధన రద్దవుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో సంరక్షణ కేంద్రాల్లోనూ నిబంధనలను సడలించనున్నట్టు స్పష్టం చేశారు. అయితే, మహమ్మారి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఐసోలేషన్‌ను ముగించాలన్ని నిర్ణయించారని మీడియా ప్రశ్నించగా.. ప్రభుత్వం ఈ విధానాన్ని సమీక్షిస్తోందని యూకే ఆరోగ్య మంత్రి సమాధానం ఇచ్చారు. ‘ఇంత వరకూ దీనిపై నిర్ణయం తీసుకోలేదు కానీ, ఫ్లూ ఉన్న వ్యక్తులు చట్టబద్ధంగా ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు.. మనం కోవిడ్ కలిసి జీవించడానికి ఒక మార్గాన్ని కనుగొనాలి’ అని వ్యాఖ్యానించారు. క్రిస్మస్ తర్వాత తొలిసారిగా యూకేలో ఈవారం రోజువారీ కేసులు తక్కువగా నమోదయ్యాయి.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3tHSmQd

Post a Comment

0 Comments