జైల్లోని ఖైదీలు మొబైల్ ఫోన్‌ను వాడుతున్నట్టు అనుమానించిన సిబ్బంది.. తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ఖైదీ తన వద్ద ఉన్న ఫోన్‌ను మింగేసిన అనూహ్య ఘటన తీహార్ జైలులో చోటుచేసుకుంది. జైలు సిబ్బంది సోదాలు నిర్వహిస్తుండగా విచారణలో ఉన్న ఖైదీ తన వద్ద ఉన్న సెల్ ఫోన్ మింగేశాడని జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయెల్ శుక్రవారం వెల్లడించారు. జనవరి 5న ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన తెలిపారు. దీంతో అతడిని హుటాహుటిన చికిత్స కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. కానీ, మొబైల్ ఫోన్ ఇంకా ఖైదీ పొట్టలోనే ఉందని చెప్పారు. శస్త్రచికిత్స చేసి బయటకు తీయాల్సి ఉంటుందని డీజీ సందీప్ తెలియజేశారు. ‘జనవరి 5న ఒకటో నెంబరు జైలులోని విచారణ ఖైదీ తన వద్ద ఉన్న సెల్ ఫోన్‌ను మింగేశాడు.. జైలు అధికారులు తనిఖీలు చేస్తుండటంతో దొరికిపోతాననే భయంతో అతడు ఇలా చేశాడు.. ప్రస్తుతం డీడీయూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.. మొబైల్ మాత్రం పొట్టలోనే ఉంది’ అని తెలిపారు. కాగా, రెండు రోజుల కిందట ఇదే జైలులో ఐదుగురు ఖైదీలు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. జైలు నంబర్ 3లోని ఒకటో నంబర్ వార్డులో ఉన్న ఐదుగురు ఖైదీలు ఆత్మహత్యకు ప్రయత్నించారు. పుదునైన ఆయుధాలతో తమను తాము తీవ్రంగా గాయపరుచుకున్నారు. ఆ ఐదుగురు గొడవ పడడాన్ని గమనించిన జైలు సిబ్బంది.. వెంటనే వాళ్లను విడదీశారు. దీంతో వాళ్లలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. గాయపడ్డ ఐదుగురిని హుటాహుటిన జైలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఓ ఖైదీని దీన్దయాల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3fg4gZv
0 Comments