ఆక్రమిత ప్రాంతంలోనే చైనా వంతెన.. కేంద్రం కీలక ప్రకటన

సరిహద్దుల్లోని ఆక్రమిత ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెనను నిర్మిస్తోందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో శుక్రవారం ప్రకటించింది. భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను ఇతర దేశాలు గౌరవిస్తాయని ఆశిస్తున్నామని స్పష్టం చేసింది. చైనా వంతెన నిర్మాణం అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఈ నిర్మాణం 1962 నుంచి చైనా ఆక్రమణలో ఉన్న ప్రాంతంలోనే కొనసాగుతోందని లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ‘‘పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మాణ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది.. ఈ వంతెనను 1962 నుంచి చైనా ఆక్రమణలో ఉన్న ప్రాంతంలోనే నిర్మిస్తోంది... భారత ప్రభుత్వం దురాక్రమణను ఎప్పుడూ అనుమతించదు.. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లడఖ్‌లు భారత్‌లో అంతర్భాగమని పలు సందర్భాల్లో భారత్ స్పష్టం చేసింది.. భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను ఇతర దేశాలు గౌరవిస్తాయని ఆశిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించింది. 2020 మే మొదటివారం నుంచి సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. తూర్పు లడఖ్‌లో ఇరు దేశాలూ 50 వేల మందికిపైగా సైన్యాలను మోహరించాయి. గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నా అంతగా ఫలించడం లేదు. దీంతో చైనా వంతెన నిర్మాణం వల్ల సరిహద్దుల్లో ప్రశాంతతకు భంగం కలిగే ప్రమాదం ఉంది. ఈ అంశంపై కూడా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేది భారత్ అభిమతమని, ఇందుకు మూడు కీలక సూత్రాలనే మార్గనిర్దేశంగా భావిస్తున్నామని తెలిపింది. ‘‘ఈ చర్చలలో మా విధానం మూడు కీలక సూత్రాలతో మార్గనిర్దేశం కొనసాగుతుంది.. (1)రెండు వైపులా ఖచ్చితంగా ఎల్ఏసీని గౌరవించాలి.. పాటించాలి; (2) యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి ఎవ్వరూ ప్రయత్నించకూడదు; (3) ఇరుపక్షాల మధ్య అన్ని ఒప్పందాలకు పూర్తిగా పూర్తిగా కట్టుబడి ఉండాలి’’ అని తెలిపింది. చివరిసారిగా భారత్, చైనా సీనియర్ కమాండర్ స్థాయి చర్చలు జనవరి 12న జరిగాయి. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి శాంతిని పునరుద్ధరిస్తూ మిగిలిన సమస్యల పరిష్కారానికి ఇరుపక్షాలూ కృషి చేయాలని ఈ చర్చల్లో అంగీకరించారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/rhwGqtL

Post a Comment

0 Comments