Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 23 February 2022

ఉక్రెయిన్‌తో తైవాన్‌కు పోలికేంటి.. ఆ ప్రాంతం మాదే: చైనా కౌంటర్

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాన్ని తైవాన్‌తో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉందని, తైవాన్‌ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమేనని పునరుద్ఘాటించింది. ఉక్రెయిన్‌ తరహాలో తైవాన్‌పైనా కొన్ని విదేశీ శక్తులు కన్నేసి ఉంచాయన్న తైవాన్‌ అధ్యక్షుడి త్సాయ్‌ ఇంగ్‌ వెన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పటికీ ఉక్రెయిన్ కాదని, చైనా అంతర్భాగమేనని వ్యాఖ్యానించారు. ‘‘తైవాన్‌ ఎప్పటికీ ఉక్రెయిన్‌ కాదు.. తైవాన్‌ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమే.. ఇది చరిత్ర చెబుతున్న నిజం. ఉక్రెయిన్‌, తైవాన్‌ను పోల్చడం అంటే.. తైవాన్‌ సమస్య విషయంలో కనీస ప్రాథమిక అవగాహన లేదనే అనుకోవాలి’’ అని హువా స్పష్టం చేశారు. దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాల్లో రాజీ పడబోమని, అవసరమైతే సైన్యాన్ని వినియోగించైనా అంతర్భాగం చేసుకోవడానికి చైనా వెనుకాడబోదని పేర్కొన్నారు. అలాగే, రష్యా, ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికాయే కారణమని చైనా ఆరోపించింది. రెండు దేశాల మధ్య అమెరికా ఉద్రిక్తతలను పెంచుతోందని, అనవసరమైన భయాందోళనలను సృష్టిస్తోందని హువా చున్‌యింగ్ ఆరోపించారు. రష్యా ఆర్థిక సంస్థలపై అమెరికా ఆంక్షలను విధించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించడం ద్వారా ఉద్రిక్తతలు పెంచుతోందని విమర్శించారు. ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో వాగ్దానాలను నెరవేర్చడంలో పాశ్చాత్య దేశాలు విఫలమైతే ప్రపంచవ్యాప్తంగా హానికరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయని, తైవాన్‌కు ప్రమాదం ఉందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఉక్రెయిన్ సంక్షోభంతో తైవాన్‌ను పోల్చడాన్ని చైనా తప్పుబట్టింది. తైవాన్‌ను తమ భూభాగంగా పేర్కొంటున్న చైనా.. గత రెండేళ్ల నుంచి ఆ దేశం సమీపంలో సైనిక కార్యకలాపాలను వేగవంతం చేసింది. పలుసార్లు తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాలు చొచ్చుకొచ్చాయి. చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ అమెరికాతో తైవాన్ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం డ్రాగన్‌కు కంటగింపుగా మారింది. దీంతో భయపెట్టైనా తైవాన్‌ను దారికి తెచ్చుకోవాలని చైనా భావిస్తోంది. తైవాన్‌ అధ్యక్షుడు మాట్లాడుతూ... భౌగోళికంగా, అంతర్జాతీయ సప్లయ్ ఛైన్ పరంగా తైవాన్, ఉక్రెయిన్ ప్రాథమికంగా భిన్నమైనవి ఆమె తెలిపారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులు తారుమారు చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే తరహాలో తైవాన్‌ను దెబ్బతీసేందుకు విదేశీ శక్తులు యత్నిస్తున్నాయంటూ చైనా పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అన్ని ప్రభుత్వ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/owl1AbJ

No comments:

Post a Comment