భారీగా సైన్యాలను తరలించిన రష్యా.. ఏ క్షణంలోనైనా ఉక్రెయిన్‌పై దాడి!

సరిహద్దుల్లోకి వేలాదిగా సైన్యాలు, ఆయుధాలు, శతఘ్నులను రష్యా మోహరించడంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలోనైనా ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడికి తెగబడితే దీటుగా తిప్పికొట్టేందుకు అమెరికా, నాటో బలగాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 8,500 మంది సైనికులను తరలించగా.. వీరికి మద్దతుగా నాటో మరికొంత మందిని పంపుతోంది. మీడియా నివేదికల ప్రకారం.. పొరుగున ఉన్న క్రిమియా, బెలారస్‌‌ సరిహద్దుల వరకూ సైన్యాల మోహరింపు కొనసాగుతోంది. కేవలం దళాలు మాత్రమే కాకుండా భారీ ఆయుధాలు, ఫిరంగి దళాలు ఉన్నాయని, వీటిలో చాలా వరకు దూర ప్రాంతాల నుంచి రైలులో రవాణా చేశారు. ఉపగ్రహాలు తీసిన ఫోటోలను బట్టి బెలారస్‌లోని బ్రెస్ట్‌స్కీ శిక్షణా మైదానంలో రష్యా దళాలు, గుడారాలు, కొత్తగా మోహరింపులు కనిపిస్తున్నాయి. బెలారస్ ఒసిపోవిచి శిక్షణా ప్రాంతంలో రష్యా సైన్యానికి చెందిన మొబైల్ షార్ట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ ఇస్కాండర్‌ను కూడా ఉంచినట్టు ఈ ఫోటోల్లో స్పష్టమవుతోంది. బెలారస్‌లోని ఓబుజ్-లెస్నోవిస్కీ శిక్షణ కేంద్రం సమీపంలోనూ రష్యా సైన్యాలను ఉన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో 100,000 కంటే ఎక్కువ మంది బలగాలను రష్యా మోహరించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను రష్యా తన ఆధీనంలోకి తీసుకుంది. క్రిమియాలోని నోవోజెర్నోయ్‌లో మోహరించిన దళాలు, సైనిక సామగ్రి కోసం కొత్తగా నిర్మాణాలు చేపట్టారు. ఈ ప్రాంతంలో సైనిక వాహనాలు, టెంట్లు, యుద్ధ వాహనాలను నిలిపి ఉంచినట్టు ఉపగ్రహాలు తీసిన ఫోటోలలో కనిపిస్తున్నాయి. పశ్చిమ రష్యాలోని బెలారస్, ఉక్రెయిన్‌తో సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతాలలో సైన్యాలు, పదాతి దళాలు, శతఘ్నలు, ఆయుధాలు, క్యారియర్లు, ట్రక్కులు తదితరాలను భారీగా మోహరించారు. అలాగే, ప్రత్యక్ష పోరులో సైనికులు గాయపడితే వారికి అత్యవసర చికిత్స అందజేసేలా వైద్య సౌకర్యాలను రష్యా ఏర్పాట్లు చేసింది. అయితే, రష్యా మాత్రం ప్రత్యక్ష దాడికి పాల్పడే ఉద్దేశం తమకు లేదని బుకాయిస్తోంది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/oafcyDNEu

Post a Comment

0 Comments