ఆ పాలసీని వెనక్కి తీసుకోకుంటే ఆమరణదీక్ష: మహా సర్కారుకు హజారే హెచ్చరిక

సూపర్‌ మార్కెట్, జనరల్‌ స్టోర్స్‌లో మద్యం విక్రయించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ సామాజిక కార్యకర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ఫిబ్రవరి 14 నుంచి తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకి లేఖ రాసినట్లు అన్నా హజారే వెల్లడించారు. ‘‘సూపర్‌మార్కెట్లు, జనరల్‌ స్టోర్లలో మద్యం విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరం.. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు.. దీనికి బదులు ప్రజలు మద్యానికి బానిసలు కాకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.. ప్రభుత్వ విధానం నిరుత్సాహానికి గురిచేసింది.. కొత్త మద్యం విధానం విషయంలో ప్రభుత్వం ముందుకెళితే నేను ఆమరణ నిరాహార దీక్ష చేపడతాను’’అని సీఎం ఠాక్రేకు రాసిన లేఖలో అన్నా హజారే హెచ్చరించారు. ఈ విషయంపై గతంలో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు లేఖ రాశానని, దానికి ఆయన స్పందించలేదని హజారే తెలిపారు. అంతేకాదు, వ్యక్తిగత విషయాలపై తాను ప్రధాన మంత్రికి లేదా ముఖ్యమంత్రికి ఎప్పుడూ లేఖలు రాయనని హజారే చెప్పారు. ‘‘నేను ముఖ్యమంత్రికి రెండు లేఖలు రాశాను. ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు.. లోకాయుక్త నియామకంపై చర్చించేందుకు ఏర్పాటైన కమిటీ సమావేశాలు కూడా జరగడం లేదు.. నేను ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫాలోఅప్ చేస్తున్నాను. ప్రత్యుత్తరాలను తప్పించుకునే ప్రయత్నాలు జరిగినట్లు కనిపిస్తోంది’’ అని హజారే ధ్వజమెత్తారు. అవినీతి నిరోధానికి జన్‌ లోక్‌పాల్ బిల్లు కోసం 2011లో అన్నా హజారే చేపట్టిన ఉద్యమం దేశ రాజకీయాల్లో ప్రకపంనలు సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు, జనవరి 27న ‘మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ)’ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో కేవలం వైన్‌ షాపుల్లోనే లభ్యమయ్యే మద్యాన్ని.. సూపర్‌ మార్కెట్, జనరల్‌ స్టోర్లలోనూ విక్రయించాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మహరాష్ట్రను ఎంవీఏ ప్రభుత్వం మద్యరాష్ట్రగా మార్చేసిందని బీజేపీ విమర్శించింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/1icrGqE

Post a Comment

0 Comments