అంటీలియా కుట్రలో మాజీ సీపీ సూత్రధారి: మాజీ హోం మంత్రి

ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌పై మహారాష్ట్ర మాజీ మంత్రి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో వాహనం నిలపడం వెనుక ఐపీఎస్ అధికారి కీలక సూత్రధారని తాను బలంగా నమ్ముతున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలిపారు. అలాగే, వాహనం యజమాని మన్‌సుఖ్ హిరేన్ హత్యలోనూ ఆయన హస్తం ఉందని భావిస్తున్నానని పేర్కొన్నారు. గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అంటీలియా బాంబు బెదిరింపు కేసు విషయమై మాట్లాడేందుకు పరమ్ బీర్ సింగ్‌ను పిలిపించామని, హోం శాఖ సీనియర్ అధికారుల సమక్షంలో తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇచ్చారని దేశ్‌ముఖ్ ఆరోపించారు. అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రికి సింగ్ ఇచ్చిన సమాధానాలు కూడా తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘అంటీలియా కేసు, హిరేన్ హత్య కేసుకు సంబంధించి పరమ్ బీర్ సింగ్‌కు అత్యంత సన్నిహితులైన సచిన్ వాజే, పోలీసు కమిషనర్ కార్యాలయంలోని మరో నలుగురి పేర్లు బయటకు రావడంతో ముంబై పోలీసు కమిషనర్ పదవి నుంచి తొలగించారు’’ అని దేశ్‌ముఖ్ చెప్పారు. ‘అతను (సింగ్) నిజాన్ని దాచిపెట్టినందున నేను పైన పేర్కొన్న విషయాలలో సూత్రధారిగా గుర్తించాను’’ అని పేర్కొన్నారు. కాగా, తనను తాను సూపర్ కాప్‌గా మళ్లీ నిలబడేందుకు సచిన్ వాజే ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. జాయింట్ పోలీస్ కమీషనర్ తీవ్రంగా వ్యతిరేకించినా పరమ్ బీర్ సింగ్ పట్టుబట్టడంతో వాజేను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్‌లో పోస్టింగ్ ఇచ్చారని దేశ్‌ముఖ్ వాదించారు. దిలీప్ ఛబ్రియా కేసుపై ప్రభుత్వానికి వివరించిన సందర్భంలో తప్ప తాను వాజేతో ఎప్పుడూ మాట్లాడలేదని ఆయన అన్నారు. గతేడాది ఫిబ్రవరి చివరివారంలో వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ ఇంటి వద్ద నిలిపి ఉంచిన కారులో పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ముంబై పోలీసు క్రైమ్‌ బ్రాంచ్‌, మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/bWZjckALO

Post a Comment

0 Comments