
ప్రశాంతంగా కనిపించే శివమొగ్గ బజరంగదళ్ కార్యకర్త హర్ష (23) హత్యతో భగభగలాడుతోంది. ప్రస్తుతం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భారతి కాలనీలో హర్షను వెంటాడి మారణాయుధాలతో హతమార్చి పరారైన ఘటన తెలిసిన వెంటనే ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హర్ష హత్యను ఖండిస్తూ బజరంగ దళ్, బీజేపీ కార్యకర్తలు, ఇతర హిందూ సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తొలుత ఆ ప్రాంతంలో, అనంతరం నగరమంతటా 144వ సెక్షన్ విధించారు. భారతి నగరకు మాత్రమే పరిమితమైన అల్లర్లు సోమవారం నగరమంతటికీ వ్యాపించాయి. ఇది కచ్చితంగా ముస్లిం గూండాల దుశ్చర్య అంటూ మంత్రి ఈశ్వరప్ప ఆరోపించడంతో విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. ఈ పరిణామాల అనంతరం నగరంలో యథేచ్ఛగా అల్లర్లు కొనసాగాయి. దాదాపు 20 దుకాణాల్ని ధ్వంసం చేశారు. ఓ మినీ లారీ, నాలుగు ద్విచక్ర వాహనాల్ని ఆందోళనకారులు తగులబెట్టారు. హర్ష అంతిమ యాత్రలో కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు ముందుగా లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోయేసరికి భాష్ప వాయుగోళాల్ని ప్రయోగించారు. అయినప్పటికీ అల్లర్లు సద్దుమణగకపోవడంతో కేఆర్‌పురం ప్రాంతంలో గాల్లో కాల్పులు జరిపారు. ఆ తరువాతనే పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనల్లో 20 మందికిపైగా గాయపడినట్టు హర్ష హత్యకు సంబంధించి నిందితుల ఆచూకీ లభించినట్లు అదనపు పోలీసు ప్రధానాధికారి మురుగన్ వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీస్ అధికారి తెలిపారు. నిందితుల అందరినీ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. నిందితుల్లో ముగ్గురు బెంగళూరుకు పరారయ్యారనే సమాచారం ఉందని తెలిపారు. హతుడి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ డిమాండ్ చేశారు. హర్ష కుటుంబానికి హోన్నలి బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య రూ.2 లక్షలు, మహదేవపుర ఎమ్మెల్యే అరవింద లింబావళి రూ. లక్ష పరిహారాన్ని ప్రకటించారు. మరోవైపు, సోమవారం నాటి అల్లర్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రిని డిమాండ్ చేసేందుకు మంగళవారం బెంగళూరులో ఆయనను కలుసుకుంటానని చెప్పారు. హతుడు హర్ష నివాసం ఎదుట, శవయాత్ర సందర్భంలో బయటి వ్యక్తులే ఎక్కువ సంఖ్యలో కనిపించినట్లు చెప్పారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/7IkBAqb
No comments:
Post a Comment