మరి కొద్ది గంటల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను వెలువరించనుండగా.. తమిళనాడు ముఖ్యమంత్రి మరో కీలక ప్రకటన చేశారు. సహకార బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలను రద్దు చేస్తున్నట్టు సీఎ ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. రైతులు, పేదలకు సహకార బ్యాంకులు ఇచ్చిన బంగారు అభరణాలపై రుణాలు మాఫీ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. తమిళనాడు సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఈసీ వెలువరించనుండగా.. బంగారం రుణాలను మాఫీ చేస్తూ సీఎం పళనిస్వామి నిర్ణయం తీసుకున్నారు. తన చర్యను సమర్థించిన పళనిస్వామి.. కోవిడ్ నుంచి ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదని, లాక్‌డౌన్ సమయంలో కొదువ పెట్టిన బంగారాన్ని పేదలు తిరిగి పొందడానికి ఇది సహాయపడుతుందని ఆయన అన్నారు. కరోనా ఉపశమన చర్యల్లో భాగంగా తమిళనాడు రాష్ట్ర సహకార బ్యాంకు తక్కువ వడ్డీకే బంగారం రుణాలు అందజేసింది. కేవలం 6 శాతం నామమాత్రపు వడ్డీతో మూడు నెలల కాల పరిమితితో రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు రుణాలు ఇచ్చింది. కాగా, ఇటీవలే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్టు పళనిస్వామి ప్రకటించారు. మొత్తం రూ.12,000 కోట్లు రుణాలను మాఫీ చేస్తున్నామని, దీని వల్ల 16 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. రెండు రోజుల కిందట శాసనసభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను పూర్తిగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేశారు. బడ్జెట్‌లో నిరుపేద కుటుంబాలకు ఉచిత బీమా కోసం రూ.5,000 కోట్ల తమిళనాడు ప్రభుత్వం కేటాయించింది. దీని వల్ల దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 55.7 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. ఎల్‌ఐసీ, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ సంస్థల భాగస్వామ్యంతో ‘అమ్మ ప్రమాద బీమా’ పథకం రూపొందించినట్లు డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం వెల్లడించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3bMCnWO
No comments:
Post a Comment