
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న షాపులో బేరమాడిన యువకుడిని షాపు నిర్వాహకుడితో పాటు అతడి స్నేహితులు తీవ్రంగా కొట్టి చంపేశారు. ఈ ఘటన పాత రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. నోయిడాకు చెందిన మహ్మద్ ఒవైసీ అనే యువకుడు స్థానికంగా మదర్సాలో పనిచేస్తుంటాడు. గత శనివారం ఏదో పని నిమిత్తం ఢిల్లీకి వెళ్లాడు. అక్కడి నుంచి రైలులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లి వెళ్లేందుకు సోమవారం రాత్రి ఢిల్లీ పాత రైల్వేస్టేషన్‌కు బయలుదేరాడు. 10 గంటల సమయంలో రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఓ షాప్‌లోకి వెళ్లి ఇయర్ ఫోన్స్ కావాలని అడిగాడు. ఆ షాపు ఓనర్ ఇయర్స్ ఫోన్స్ చూపించి ధర ఎక్కువగా చెప్పడంతో మహ్మద్ తనకొద్దని చెప్పి వెళ్లిపోయాడు. షాపు ఓనర్ కాస్త ధర తగ్గించినా తీసుకోవడానికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన షాపు యజమాని మహ్మద్‌ను తీవ్రంగా దూషించాడు. తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి రప్పించి అతడిపై విచక్షణా రహితంగా దాడి చేయించాడు. వారి దెబ్బలకు తాళలేకపోయిన మహ్మద్ వదిలిపెట్టాలని వేడుకున్నా కనికరించలేదు. ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోగా నిందితులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన మహ్మద్‌ను పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించేలోగానే ప్రాణం పోయింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2MIkpu8
No comments:
Post a Comment