
ఓ అంతర్జాతీయ ఉగ్రవాది వ్యక్తిగత ఖర్చుల కోసం డబ్బులిప్పించమని ఐక్యరాజ్యసమితిని కోరడంపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇది పాకిస్థాన్ కపట బుద్ధికి నిదర్శనమని, దాని నిజస్వరూపం బయటపడిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ధ్వజమెత్తారు. ఓవైపు ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెప్పుకునే పాకిస్థాన్.. ఇంకోవైపు ఉగ్రవాదులకు అండగా ఉంటుందనడానికి ఇదే ఆధారమని రవీశ్ కుమార్ దుయ్యబట్టారు. ఓ అంతర్జాతీయ ఉగ్రవాది తరఫున ఒక దేశం ఐరాసను ఆశ్రయించడం విడ్డూరంగా ఉందని, ఉగ్రవాదులపై పాకిస్థాన్ చర్యలు తీసుకుంటుందంటే ప్రపంచం ఎలా నమ్ముతుందని ఎద్దేవా చేశారు. ముంబై మారణహోమం సూత్రధారి హఫీజ్ సయీద్‌ను 2012లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ప్రకటించిన విషయం తెలిసిందే. భద్రతామండలీ తీర్మానం మేరకు హఫీజ్ సయీద్ ఆర్థిక లావాదేవీలను రెండేళ్ల కిందట పాకిస్థాన్ స్తంభింపజేసింది. అతడి బ్యాంకు ఖాతాలను నిలిపివేసింది. అయితే, కనీస అవసరాలకు కూడా డబ్బుల్లేక తన కుటుంబం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని పాక్ ప్రభుత్వాన్ని హఫీజ్ ఆశ్రయించాడు.నెలవారీ ఖర్చుల కోసం తన ఖాతా నుంచి నగదు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరాడు. అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న పాక్.. భద్రతామండలికి ఆగస్టు 15న లేఖ రాసింది. దీంతో హఫీజ్ సయూద్ వ్యక్తిగత ఖర్చుల కోసం అతడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించాలని ఐరాసను కోరింది. పాక్ అభ్యర్థనపై సభ్యదేశాలు నిర్ణీత గడువులోగా ఎలాంటి అభ్యంతరం తెలపకపోవడంతో సెక్యూరిటీ కౌన్సిల్ దీనిని ఆమోదించడం విశేషం. కాగా, హఫీజ్ వ్యక్తిగత ఖర్చుల కోసం నెలకు రూ.1,50,000 (పాకిస్థానీ కరెన్సీ) విత్‌డ్రా చేసుకునేలా సయీద్‌కు అనుమతి ఇవ్వాలని అందులో కోరింది. హఫీజ్ మహ్మద్ సయీద్, హజీ మహ్మద్ అష్రఫ్, జఫర్ ఇక్బాల్ పేర్లను దీనిలో ప్రస్తావించింది. నిర్ణీత గడువులోగా దీనిపై సభ్యదేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో భద్రతామండలి అంగీకరించింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2LNjZkz
No comments:
Post a Comment