
ఏలూరులో పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు. లక్షల మంది ప్రయాణికులను నిత్యం గమ్యస్థానానికి చేరుస్తున్నారంటూ ఆటో, ట్యాక్సీ డ్రైవర్లపై సీఎం ప్రశంసలు గుప్పించారు. పాదయాత్ర సందర్భంగా ఇదే ఏలూరులో వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తామని మాటిచ్చానని.. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నానని జగన్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వాహన మిత్రను అమలు చేస్తున్నామన్నారు. ‘‘ఇన్సూరెన్స్, రోడ్డు ట్యాక్స్ తదితరాల కోసం ఏడాదికి రూ. 10 వేలు ఖర్చవుతుందని ఆటో సోదరులు నాతో చెప్పారు. ఆ మాటలను నేను ఎప్పటికీ మర్చిపోను. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని ఇచ్చిన ఆ మాటకు కట్టుబడి.. నాలుగు నెలలు కూడా గడవక ముందే మీ అందరి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. ఏటా పది వేల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేలు మీ అకౌంట్లలో వేస్తా’’మని జగన్ తెలిపారు. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు మేలు చేయాలని బహుశా దేశంలో ఎవరూ ఆలోచన చేసి ఉండరు. అలా చేసింది మన దగ్గరే. పథకాల అమలుకు కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు చూడొద్దని.. అర్హులందరికీ పథకాలు అందాలని ఆదేశించాను. 1.75 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే.. 1.73 లక్షల మందికిపైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఎక్కడా వివక్షకు, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. వైట్ రేషన్ కార్డు ఉండి, ఆటో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామన్నారు. ఈ రాష్ట్రానికి జగన్ అనే నేను సీఎంగా ఉన్నానని గర్వంగా చెబుతున్నా. పొరబాటున ఎవరికైనా ఈ పథకం వర్తించకపోతే.. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు జగన్ తెలిపారు. వాళ్లకు నవంబర్లో వాహనమిత్ర సొమ్మును ఇస్తామని జగన్ చెప్పారు. బటన్ నొక్కిన రెండు మూడు గంటల్లోనే మీ ఖాతాల్లో రూ.10 వేలు జమ అవుతాయన్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2LJrNUm
No comments:
Post a Comment