తనకు ఓ తోడు కావాలని ఓ బామ్మ ఇచ్చిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూస పద్దతులకు స్వస్తిచెప్పి ఈ వయసులోనూ ఆమె తోడు కోసం చేస్తున్న ప్రయత్నానికి నెటిజన్ల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. జీవితానికి ఎక్కువ విలువ ఇస్తున్నారని ప్రశంసిస్తున్నారు. బామ్మ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న యువత... వృద్ధుల పట్ల నిరాదరణ చూపుతున్న సమాజానికి ఇదో మేలుకొలుపు అని అంటున్నారు. నెట్టింట్లో చర్చనీయాంశంగా మారిన ఈ ప్రకటనను కర్ణాటకకు చెందిన ఓ 73 ఏళ్ళ వృద్ధురాలు ఇచ్చారు. మైసూరుకు చెందిన ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేసి పదవీవిరమణ చేశారు. గతంలో వివాహమైనా అతడి నుంచి విడాకులు తీసుకున్నారు. ‘నాకు కుటుంబం లేదు. నా తల్లిదండ్రులు చనిపోయారు. నా తొలి వివాహం విడాకులతో ముగిసింది. నేను ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నాను. ఇంట్లో పడిపోతే సాయం చేసేవారు ఉండరనే ఆలోచన వస్తోంది. బస్టాప్ నుంచి ఇంటికి నడవాలంటే భయమేస్తోంది. ఇలాంటి ఆలోచనలు జీవిత భాగస్వామి కోసం చూసేలా చేస్తున్నాయి’ అని ఆమె టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు. జీవిత చరమాంకం వరకూ తనతో కలిసి ఉండే ఓ తోడు కావాలని అన్నారు. తనకు ఓ వరుడు కావాలని ప్రకటన ఇచ్చిన ఆమె.. ఆరోగ్యవంతుడు, తన కన్నా వయసులో పెద్దవాడు, తప్పనిసరిగా బ్రాహ్మణుడు అయి ఉండాలని పేర్కొన్నారు. తాను కూడా బ్రాహ్మణ మహిళనేనని తెలిపారు. తన తల్లిదండ్రులు చనిపోయారని, కొంత కాలంగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నానని వివరించారు. అంతేకాదు, తన మొదటి వివాహం అత్యంత బాధాకరంగా విడాకులతో ముగిసిందని, ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోలేదని అన్నారు. ప్రస్తుతం బస్టాప్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలంటే భయమేస్తోంది.., ఒంటరిగా జీవించడం కష్టంగా ఉందని, అందుకే తోడు కోసం చూస్తున్నానని తెలిపారు. ఈ ప్రకటనను చూసినవారు ఆమెను అభినందించడంతోపాటు మోసగాళ్లు ఉంటారని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రకటనపై కర్ణాటకకు చెందిన హక్కుల కార్యకర్త రూపా హసన్ మాట్లాడుతూ.. ఆమె ఒంటరితనానికి భయపడుతుంది.. ఇప్పటివరకు స్వతంత్ర జీవితాన్ని గడిపి భాగస్వామి కోసం వెతుకుతున్నారని అన్నారు. ‘ఆమె నిర్ణయం సరైందే కానీ, దీనిని మోసగాళ్లు తమ అనుకూలంగా మలచుకునే ప్రమాదం ఉంది’ అని అన్నారు. అయితే, వృద్ధుల పట్ల సమాజం చూపుతున్న నిరాదరణకు ఈ ప్రకటన మేలుకొలుపు, వయసు పెరిగే కొద్దీ వారిలో అభద్రతాభావం పెరుగుతోంది అని ఓ మానసిక నిపుణుడు వ్యాఖ్యానించారు. ‘ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి.. ప్రజల మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. అనేక సమస్యలకు ఇది దారితీస్తుంది’ అని అన్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2QH3yLz
No comments:
Post a Comment