మానవత్వానికే మాయనిమచ్చలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. అత్యాచార బాధితురాలిపై సానుభూతి చూపాల్సింది పోయి ఆమెను నిందితుడితో కలిసి బలవంతంగా ఊరేగించిన దారుణ ఘటన అలీరాజ్‌పూర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. గిరిజనుల ప్రాబల్యం ఉన్న గ్రామానికి చెందిన పదహారేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులకు అప్పగించాల్సింది పోయి.. బాధితురాలి పట్ల దారుణంగా వ్యవహరించారు. నిందితుడు, బాధితురాలిని తాళ్లతో బంధించి గ్రామంలో ఊరేగించారు. వారిని కొడుతూ భారత్ మాతాకీ జై అనే నినాదాలు చేశారు. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వచ్చేసరికి ఊరేగింపు జరుగుతుండటంతో బాధితురాలిని వారి బారి నుంచి కాపాడారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి సహా ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా నిందితుడి కలిసి నడవాలని బలవంతం చేసిన వారిలో బాధితురాలి కుటుంబ సభ్యులు ఉండటం గమనార్హం. ఈ ఘటనపై రెండు కేసులు నమోదుచేసినట్టు పోలీస్ అధికారి దిలీప్ సింగ్ బిలావల్ అన్నారు. ‘అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై ఓ కేసు.. బాధితురాలిని బలవంతంగా ఊరేగించి, దాడికి పాల్పడిన ఘటనలో కుటుంబసభ్యులు, గ్రామస్థులపై మరో కేసు’ నమోదుచేసినట్టు పీటీఐకి తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద, మిగతావారిపై మహిళ గౌరవానికి భంగం కలిగించినందుకు 355, 342 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3sJRSFS
No comments:
Post a Comment