
కష్ట సుఖాలు పంచుకున్న భార్య ఇక లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఓ వృద్ధుడు. జీవితాంతం తోడుగా ఉంటుందకున్న సహధర్మచారిణి అర్ధాంతరంగా తనువు చాలించడంతో తట్టుకోలేకపోయాడు. తమ వైవాహిక బంధానికి మృత్యువే ముగింపు అన్నట్లు భార్య చితిలోకి దూకి చావులోనూ ఆమెకు తోడయ్యాడు. గుండెల్ని మెలిపెట్టే ఈ ఘటన ఒడిశాలో రెండు రోజుల కిందట చోటుచేసుకుంది. కలహండి జిల్లా గోలముండా సమితిలోని శైలుజోడి గ్రామానికి చెందిన నీలమణి శబర (70) భార్య చితిలోకి దూకి తనువు చాలించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలమణి శబర, రాయబరి శబర (60) భార్య భర్తలు కాగా.. వీరికి నలుగురు కుమారులు ఉన్నారు. అయితే, రాయబరి మంగళవారం గుండెపోటుతో మరణించింది. దీంతో బుధవారం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. నలుగురు కుమారులు, భర్త, బంధువులంతా కలిసి గ్రామ శివారుల్లోని శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ చితి పేర్చి మృతదేహానికి నిప్పంటించి.. అందరూ ఇళ్లకు బయలుదేరారు. పక్కనే ఉన్న చెరువులోనే వారంతా స్నానాలు చేస్తున్నారు. ఇదే సమయంలో భర్త నీలమణి శబర పరుగెత్తుకుని వెళ్లి భార్య చితిపైకి దూకేశాడు. పరుగున వెళ్లి మంటల్లో దూకేయడంతో అందరూ షాక్ తిన్నారు. ఆయన ఎందుకు అలా వెళ్లాడో తెలిసేలోపు ఒకే చితిలో భార్యాభర్తలు కాలిపోయారు. ఈ ఘటన గురించి పోలీసులకు తెలియడంతో అక్కడకు చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి.. దర్యాప్తు చేపట్టారు. భార్య మరణం తట్టుకోలేక ఆయన ఈ సాహసం చేశాడని అన్నారు. గ్రామ సర్పంచ్ దనరా బాగ్ మాట్లాడుతూ.. ‘ఇరువురూ చిన్ని ఇంట్లోనే ఉంటూ ఎంతో అనోన్యంగా జీవించారు. ఆమె చనిపోవడంతో ఒకర్ని విడిచి ఒకరు ఉండలేక ఇటువంటి భయంకర నిర్ణయం తీసుకున్నారు.. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు’ అని తెలిపారు. అయితే, ఒకప్పుడు భర్త చనిపోతే ఆయనతోపాటు భార్య కూడా సహగమనం చేసే దురాచారం దేశంలో ఉండేది. ఈ సాంఘిక దురాచారంపై రాజారామ్‌మోహన్ రాయ్ వంటి సంఘ సంస్కర్తలు పోరాటం చేశారు. వారి పోరాట ఫలితంగా దేశంలో సతీసహగమనాన్ని నాటి ఆంగ్లేయ పాలకులు బహిష్కరించారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3sMC46h
No comments:
Post a Comment