
డ్రోన్ కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సడలించింది. డ్రోన్లను ఎగరవేయడానికి పూర్తిచేయాల్సిన దరఖాస్తుల సంఖ్యను 25 నుంచి ఐదుకు కేంద్ర పౌరవిమాయాన సంస్థ కుదించింది. ప్రస్తుతం 72 రకాల ఛార్జీలను వసూలు చేస్తుండగా.. తాజా సడలింపుల ప్రకారం ఒక్కో ఆపరేటర్ నాలుగు రకాల రుసుములను చెల్లిస్తే సరిపోతుంది. ఈ కొత్త నిబంధనలు విమానయాన రంగంలో మైలురాయిలా నిలిచిపోతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ‘నమ్మకం, స్వీయ ధ్రువీకరణ ప్రాతిపదికన వీటిని తీసుకొచ్చాం.. ఆమోదాలు, పాటించాల్సిన నిబంధనలు, ప్రవేశ అవరోధాలను గణనీయంగా తగ్గించాం’’ అని తెలిపారు. స్టార్టప్ పరిశ్రమలు, ఈ రంగంలో పనిచేసే యువతకు ఇవి చాలా ఉపయోగపడతాయని చెప్పారు. తాజా నిబంధనలు సరకు రవాణాలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి తెలిపారు. ‘వ్యవసాయం, ఆరోగ్యపరిరక్షణ, మైనింగ్ వంటి రంగాలకు ప్రయోజనం కలుగుతుంది.. ఎయిర్ ట్యాక్సీలకూ ఇది మార్గం సుగమం చేస్తుంది.. మనం రోడ్లపై చూస్తున్న ఉబర్ వంటి ట్యాక్సీలు గగనతలంలో ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదు’’ అని సింధియా పేర్కొన్నారు. డ్రోన్ నిబంధనలు-2021 పేరిట పౌర విమానయాన శాఖ వీటిని జారీ చేసింది. ఈ ఏడాది మార్చి నుంచి అమల్లోకి వచ్చిన మానవ రహిత విమాన వ్యవస్థల నిబంధనలు-2021 స్థానంలో వీటిని తెచ్చింది. డ్రోన్ నిర్వాహకులు చెల్లించాల్సిన రుసుములు ఇక నామమాత్రంగానే ఉంటాయి. ఈ ఛార్జీలకు డ్రోన్ల పరిమాణంతో ఇక సంబంధం ఉండదు. ఉదాహరణకు.. రిమోట్ పైలట్ లైసెన్సు కోసం ఫీజును రూ.3వేల (భారీ డ్రోన్‌కు) నుంచి రూ.100కు (అన్ని విభాగాల డ్రోన్లకు) తగ్గించారు. కనఫార్మెన్స్, నిర్వహణ, దిగుమతి క్లియరెన్స్ ధ్రువీకరణ పత్రాలు, ఆపరేటర్ పర్మిట్, ఆర్ అండ్ డీ సంస్థ ధ్రువీకరణ, విద్యార్థి రిమోట్ పైలట్ లైసెన్సు, విశిష్ట అథీకృత సంఖ్య, విశిష్ట ప్రొటోటైప్ గుర్తింపు సంఖ్య, గగనయాన సామర్థ్య సర్టిఫికెట్ వంటివి అవసరం లేదు. ‘గ్రీన్ జోన్’లలో 400 అడుగుల ఎత్తు వరకూ ఎలాంటి అనుమతి అవసరం లేకుండానే డ్రోన్లను నడుపుకోవచ్చు. విమానాశ్రయ ప్రహరీగోడ నుంచి 8-12 కిలోమీటర్ల మధ్య ఉన్న ప్రాంతంలో 200 అడుగుల ఎత్తు వరకూ వీటిని నిర్వహించుకోవచ్చు. గగనతల మ్యాప్‌లో రెడ్, యెల్లో జోన్లకు వెలుపలి ప్రదేశాల్లో 400 అడుగుల ఎత్తు వరకూ ఉండే ప్రాంతాన్ని గ్రీన్ జోన్‌గా పేర్కొంటారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3BglrCT
No comments:
Post a Comment