దేశంలో 2.51 లక్షల కొత్త కేసులు.. కోలుకున్నవారే అధికం

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకూ దేశవ్యాప్తంగా 2.51 లక్షల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. మరో 627 మంది మహమ్మారికి బలయ్యారు. అలాగే, కొత్త కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. గురువారం దేశవ్యాప్తంగా 3.47 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసులు 21 లక్షలకు చేరాయి. బుధవారంతో పోల్చితే గురువారం 35 వేలకుపైగా తక్కువ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 5.18 శాతంగా ఉన్నాయని, రికవరీ రేటు 93.60గా నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో పాజిటివిటీ రేటు బుధవారం 19.59 శాతం ఉండగా.. గురువారం నాటికి ఇది 15.88 శాతానికి పడిపోయింది. వీక్లీ పాజిటివిటీ రేటు మాత్రం 17.47 శాతంగా ఉంది. జనవరి 26 నాటికి దేశంలోని 400కిపైగా జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉంది. కేరళలో అత్యధికంగా 51 వేలు కేసులు బయటపడగా.. మరో 68 మంది కరోనాతో కన్నుమూశారు. కేరళలో పాజిటివిటీ రేటు 50 శాతంగా ఉంది. ఇక, కర్ణాటకలో గురువారం 38,083 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 67,236 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లారు. చికిత్స పొందుతూ 49 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,28,711కు చేరుకున్నాయి. పాజిటివిటీ 20.44 శాతం, మరణాలు 0.12 శాతంగా నమోదయ్యాయి. మహారాష్ట్రలో 25,425 కొత్త కేసులు నిర్ధారణ కాగా.. మరో 42 మంది మహమ్మారికి బలయ్యారు. మరోవైపు, దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ 164 కోట్లకుపైగా టీకా డోస్‌లను పంపిణీ చేశారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3orMesf

Post a Comment

0 Comments