సైనిక చెక్ పోస్ట్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. నైరుతి ప్రావిన్సులోని కెచ్ జిల్లాలో భద్రతాదళాల చెక్ పోస్టుపై ఉగ్రవాదులు మెరుపు దాడికి తెగబడ్డారు. జనవరి 25-26 రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడిలో 10 మంది సైనికులు మరణించారని పాక్ మిలిటరీ మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ప్రకటించింది. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని, మరి కొందరు గాయపడ్డారని తెలిపింది. ఎంత ఖర్చయినా మా భూభాగం నుంచి ఉగ్రవాదులను అంతమొందించాలని సాయుధ బలగాలు కృతనిశ్చయంతో ఉన్నాయని పేర్కొంది. మెరుపుదాడితో అప్రమత్తమైన పాక్ సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారని అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ఇరాన్, అఫ్గన్ సరిహద్దుల్లోని బలూచిస్థాన్ హింసాత్మక తిరుగుబాటుకు నిలయంగా మారింది. ఈ ప్రాంతంలోని చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని బలూచ్ తిరుగుబాటుదారులు గతంలో పలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఏడాది జనవరి 5న ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్‌లలో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు సైనికులు చనిపోయారు. దేశం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు సైన్యం వెనక్కు తగ్గబోదని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా గతవారం చెప్పారు. అమర సైనికుల త్యాగాలు వృథా కావని, పాకిస్థాన్‌లో పూర్తి శాంతి నెలకొల్పుతామని జనరల్ బజ్వా ప్రతిజ్ఞ చేశారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3KNEB8R
0 Comments