భారత్- మధ్య ఆసియా తొలి సదస్సు: అఫ్గన్, ఉగ్రవాదంపై మోదీ ఆందోళన

ప్రాంతీయ స్థిరత్వం, భద్రత కోసం భారత్‌-మధ్య ఆసియాల మధ్య సహకారం పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అఫ్గనిస్థాన్‌ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన నేపథ్యంలో ఆ అవసరం మరింత పెరిగిందని మోదీ నొక్కిచెప్పారు. గురువారం జరిగిన భారత్- మధ్య ఆసియా దేశాల తొలి సదస్సులో విర్చువల్‌గా మోదీ ప్రసంగించారు. భారత్‌ ఆతిథ్యం ఇచ్చిన ఈ సదస్సులో కజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తజకిస్థాన్‌, తుర్కెమెనిస్తాన్‌ దేశాధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఫ్గన్ భూభాగం నుంచి ఏ దేశంపైనా ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతి ఇవ్వొద్దని తాలిబన్లకు భారత్‌ సూచించింది. సరిహద్దు తీవ్రవాదాన్ని ఖండించిన .. కనెక్టివిటీ కార్యక్రమాలను అనుసరించడంలో సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు గౌరవం సహా పారదర్శకత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. కనెక్టివిటీతో పాటు ప్రాంతీయ భద్రతపై దృష్టి సారించాలని సదస్సులో పేర్కొన్నారు. సమీకృత, స్థిరమైన పొరుగు దేశంగా ఉండాలనేది భారత్ విజన్ అని మోదీ నొక్కిచెప్పారు. అఫ్గన్ పరిస్థితిని పరిష్కరించడానికి, కజకిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్తాన్‌లతో చబహార్ పోర్ట్ ద్వారా కనెక్టివిటీని ప్రోత్సహించే ప్రత్యేక జాయింట్ వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయడానికి ఇరు పక్షాలూ అంగీకరించాయి. మధ్య ఆసియా దేశాధినేతలతో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమావేశమైన రెండు రోజుల్లోనే ఈ సదస్సు జరగడం గమనార్హం. సమావేశం అనంతరం సంయుక్త తీర్మానంలో ‘కనెక్టివిటీ కార్యక్రమాలు పారదర్శకత, విస్తృత భాగస్వామ్యం, స్థానిక ప్రాధాన్యతలు, ఆర్థిక స్థిరత్వం, అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించే సూత్రాలపై ఆధారపడి ఉండాలి’ అని ఇరు పక్షాలు పేర్కొన్నాయి. అఫ్గనిస్థాన్‌లో పరిణామాలపై మేమంతా ఆందోళన చెందుతున్నాం.. ఈ సందర్భంలో ప్రాంతీయ భద్రత, సుస్థిరతకు మా పరస్పర సహకారం మరింత ముఖ్యమైంది’ అని ప్రధాని తన ప్రారంభ ఉపన్యాసంలో అన్నారు. ప్రాంతీయ భద్రత, శ్రేయస్సు కోసం భారత్, మధ్య ఆసియా మధ్య సహకారం చాలా అవసరం. మూడు మధ్య ఆసియా దేశాలైన తుర్క్‌మెనిస్థాన్ , తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లు అఫ్గన్‌తో సరిహద్దులను పంచుకుంటాయి. గతేడాది నవంబరులో అఫ్గన్ పరిస్థితులపై తొలిసారి ఓ సదస్సు నిర్వహించిన భారత్.. అక్కడ సమ్మిత ప్రభుత్వం ఏర్పాటుచేయాలని, తీవ్రవాదం, డ్రగ్స్ అక్రమ రవాణాను నిరోధించాలని తీర్మానించింది. అలాగే, అఫ్గన్ ప్రజలకు మానవతా సాయం, మహిళలు, చిన్నారులు, మైనార్టీల హక్కుల పరిరక్షణలో ఐక్యరాజ్యసమితి కీలక పాత్ర పోషించాలని భారత్ నొక్కిచెప్పింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/33Wuiic

Post a Comment

0 Comments