స్టేడియంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి.. 40 మందికిపైగా గాయాలు

మైదానంలో తొక్కిసలాట చోటుచేసుకుని ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రేక్షకులు గాయపడ్డారు. ఈ దురదృష్టకర ఘటన ఆఫ్రికా దేశం కెమెరూన్ రాజధాని యువాండేలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆఫ్రికా దేశాల ఫుట్‌బాల్ కప్ టోర్నీ మ్యాచ్‌ జరగడానికి ముందే దుర్ఘటన జరిగింది. యువాండలోని ఒలెంబే స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఒక్కసారిగా ప్రేక్షకులు లోపలికి వెళ్లేందుకు ఎగబడటంతో తొపులాట జరిగి, చివరకు తొక్కిసలాటకు దారితీసింది. ‘ఒలెంబే స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.. పదుల సంఖ్యలో ప్రేక్షకులు గాయపడ్డారు’ అని కెమెరూన్ అధికారిక మీడియా సీఆర్టీవీ వెల్లడించింది. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారని పేర్కొంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రికా ఫుట్‌బాల్ (సీఏఎఫ్) ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేపట్టి, ఎలా జరిగిందనేది పారదర్శకంగా మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని సీఏఎఫ్ తెలిపింది. యువాండలోని మెస్సాస్సే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి తమ సెక్రెటరీ జనరల్‌ను పంపుతున్నట్టు సీఏఎఫ్ తెలిపింది. అలాగే, కెమెరూన్ ప్రభుత్వం, స్థానిక ఆర్గనైజింగ్ కమిటీతో నిరంతరం సంప్రదిస్తూ సమాచారం గురించి తెసులుకుంటున్నామని పేర్కొంది. కామెరూన్, కొమొరోస్ మ్యాచ్ చివరి విజిల్ వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత స్టేడియం చుట్టూ తొక్కిసలాట జాడ లేదని ఏఏఫ్‌పీ జర్నలిస్ట్ తెలిపారు. తొక్కిసలాటలో గాయపడిన 40 మంది తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మెస్సాస్సే వైద్యులు తెలిపారు. కాగా, స్టేడియం సామర్ధ్యం 60 వేలుకాగా.. కోవిడ్ నేపథ్యంలో 80 శాతం మందిని అనుమతించాలని నిర్ణయించారు. మ్యాచ్ చూడటానికి 50వేల మందికిపైగా హాజరయినట్టు అధికారులు పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా మ్యాచ్ మాత్రం కొనసాగడం గమనార్హం.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3u2dl0B

Post a Comment

0 Comments