అమెరికాలో మంచు తుఫాన్.. స్తంభించిపోయిన రవాణా, 4 వేల విమాన సర్వీసులు రద్దు

అగ్రరాజ్యం అమెరికాను కుదిపేస్తోంది. దట్టంగా మంచు కురుస్తోంది. దాంతో ఎక్కడ చూసినా గుట్టలుగుట్టలుగా మంచు పేరుకుపోయింది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. రోడ్లపై రెండు అడుగుల ఎత్తున మంచు పేరుకుపోవడం వల్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇక పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూతబడ్డాయి. మంచు తుఫాన్ కారణంగా దేశ వ్యాప్తంగా నాలుగు వేల విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. అలాగే రైలు పట్టాలపై కూడా మంచు పేరుకుపోవడంతో రైళ్లను నిలిపివేశారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం నిలిచిపోయింది. దాంతో 70 మిలియన్ల మంది జనాభా అంధకారంలోకి వెళ్లిపోయింది. మసాచుసెట్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు 1,17,000 ఇళ్లల్లో కరెంట్ లేదు. దాంతో వారంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తీర ప్రాంతాల్లో 30 సెంటిమీటర్ల కంటే ఎక్కువగా మంచు కురుస్తోంది. మంచు తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎవరూ బయటకు రావొద్దని, ఇళ్లలోనే ఉండమని ప్రజలను అక్కడి అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరారు. అదేవిధంగా చెట్లు కింద ఉండకూడదని, అవి కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. విపరీతమైన మంచు కారణంగా కొన్ని చోట్ల మరణాలు సంభవించాయి. అయితే మంచు తుఫాన్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/fxqo4KBb6

Post a Comment

0 Comments