అమెరికాలో అగ్నిప్రమాదం.. 9 చిన్నపిల్లలతో సహా 19 మంది మృతి

అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. న్యూయార్క్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఇందులో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. తూర్పు 181వ వీధిలోని 19 అంతస్తుల భవనమైన బ్రోంక్స్ ట్విన్ పార్క్ అపార్ట్‌మెంట్స్‌లో మంటలు చెలరేగాయి. ఈ యాక్సిడెంట్‌లో 19 మంది మృతి చెందడంతో పాటు 60 మందికిపైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ అగ్ని ప్రమాదాన్ని నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ సీనియర్ సలహాదారు స్టీఫన్ రింగెల్ ధ్రువీకరించారు. క్షతగాత్రుల్లో 13 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. గత 30 ఏళ్లలో నగరంలో అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదమని అన్నారు. అపార్ట్‌మెంట్‌లోని ప్రతి అంతస్తులోనూ బాధితులు ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి 200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రతి ఫ్లోర్‌లోనూ బాధితులను ఉన్నట్టు గుర్తించి, వారిని బయటకు తీసుకొచ్చారు. పొగ పీల్చడం వల్ల పలువురు మరణించారని, దాని వల్లే చాలా మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదాన్ని అగ్నిమాపక శాఖ కమిషనర్ డేనియల్ నిగ్రో 1990లో జరిగిన అగ్ని ప్రమాదంతో పోల్చారు. అప్పట్లో హ్యాపీ ల్యాండ్ సోషల్ క్లబ్‌లో ఓ వ్యక్తి బయటకొచ్చి భవనానికి నిప్పంటించాడు. అప్పుడు 87 మంది మరణించారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3GdYKCb

Post a Comment

0 Comments