పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2021-22ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. తొలి దశ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు.. రెండో దశ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం ముగిసిన అనంతరం లోక్‌సభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు రాజ్యసభ మొదలవుతుంది. అయితే, కోవిడ్-19 నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలను వేర్వేరు సమయాల్లో నిర్వహించనున్నారు. తొలివిడత బడ్జెట్ సమావేశాల్లో ఫిబ్రవరి 11 వరకు రాజ్యసభ ఉదయం 10 నుంచి 3 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. కాగా, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై దృష్టి సారించగా.. పార్లమెంట్ వేదికగా దేశంలోని పలు సమస్యలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా సరిహద్దుల్లో చైనా చొరబాట్లు, పెగాసస్ స్పైవేర్, ఎయిర్ ఇండియా విక్రయం, కొవిడ్ బాధితులకు ప్యాకేజీ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బడ్జెట్ సమావేశాలు జరగడం ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ సమావేశాలు ఆయా రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆర్థిక, రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పంటలకు 'కనీస మద్దతు ధర' (ఎంఎస్‌పీ) అంశంపై పోరాటానికి రైతు సంఘాలు మరోసారి సిద్ధమవుతున్నాయి. ఎంఎస్‌పీ చట్ట బద్ధత కోసం తమ పోరాటం కొనసాగుతుందని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ ఇప్పటికే ప్రకటించారు. ఏడాది పాటు సాగిన ఉద్యమంలో 700 మందిని కోల్పోయిన విషయాన్ని తాము ఎన్నటికీ మరచిపోమని చెప్పారు. ఈ అంశంపై బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తేందుకు విపక్షాలు సమాయత్తమవుతున్నాయి. పెగాసస్ స్పైవేర్‌ను ఇజ్రాయెల్-భారత్ రక్షణ ఒప్పందంలో భాగమేనంటూ ఇటీవల న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించడంతో బడ్జెట్ సమావేశాల్లో దీనిని విపక్షాలు ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని నిశ్చితాభిప్రాయంతో ఉన్నాయి. సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని విపక్షాలు స్పష్టం చేశాయి. అయితే, న్యూయార్క్ టైమ్స్‌ను 'సుపారీ మీడియా' అంటూ కేంద్ర మంత్రి వీకే సింగ్ పోల్చడం గమనార్హం. కాగా, కేంద్ర బడ్జెట్టుపై అన్ని వర్గాల ప్రజల్లో భారీ అంచనాలు, ఆకాంక్షలు ఉన్నా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తనకున్న పరిమితుల మేరకు ప్రతిపాదనలకు తుదిరూపునివ్వనున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు ప్రకటించవచ్చనే ఉత్కంఠ అన్ని వర్గాల్లో ఉంది.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/XytPDYOmS
0 Comments