కిట్‌కాట్ చాక్లెట్‌పై హిందూ దేవుళ్ల ఫోటోలు.. వివాదం రేగడంతో నెస్లే క్షమాపణలు

చాక్లెట్ కవర్లపై హిందూ దేవుళ్ల బొమ్మలను ముద్రించిన తయారీ సంస్థ ‘నెస్లే ఇండియా’ వివాదంలో చిక్కుకుంది. చాక్లెట్‌ (రేపర్‌) కవర్లపై దేవుడి బొమ్మలను ముద్రించడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తక్షణమే క్షమాపణలు చెప్పిన నెస్లే కంపెనీ.. ఆ చాక్లెట్లను వెనక్కి తెప్పిస్తున్నట్టు వెల్లడించింది. ‘కిట్‌ కాట్’ చాక్లెట్‌ రేపర్‌పై నెస్లే కంపెనీ జగన్నాథస్వామితో పాటు బలభద్ర, సుభద్రల ఫోటోలను ముద్రించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ మత విశ్వాసాలను కించపరిచేలా ఉందని సదరు కంపెనీపై సామాజిక మాధ్యమాల వేదికగా దుమ్మెత్తిపోశారు. దేవుడి ఫోటోలున్న ఉన్న ఈ చాక్లెట్లను తిన్న తర్వాత ఆ రేపర్లను రోడ్లు, చెత్త బుట్టలు, మురికి కాలువల్లో పడేస్తారని, కాబట్టి వాటి ముద్రణను ఆపేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘మన ఒడిశా సంస్కృతి.. జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలను కిట్‌క్యాట్‌ చాక్లెట్‌పై చూడటం గర్వంగా ఉంది.. చాక్లెట్లను తిన్న తర్వాత దాని కవర్లను రోడ్లు, చెత్త బుట్టలు, మురికి కాలువల్లో పడేస్తారు.. చాలా మంది వాటిపై నుంచి నడుచుకుని వెళ్తారు’’అని ఓ నెటిజన్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో నెటిజనల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో నెస్లే కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎవరి మనోభావాలను కించపరచాలనేది తమ ఉద్దేశం కాదని, ఒడిశా సంప్రదాయాన్ని ఇతర ప్రాంతాలకు పరిచయం చేయాలనేది తమ అభిమతమని పేర్కొంది. గతేడాది ప్రారంభించిన ఈ ప్యాకెజ్ చాక్లెట్లు తక్షణమే వెనక్కు రప్పిస్తామని తెలిపింది. ‘ఒడిశా సంప్రదాయాన్ని ఇతర ప్రాంతాలకూ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాం.. కళను, కళాకారులను ప్రోత్సహించాలనేది మా ఉద్దేశం.. ఇదెంత సున్నితమైన అంశమో మేం అర్థం చేసుకోగలం.. దీని వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే.. చింతిస్తున్నాం.. ఒడిశా ప్రభుత్వం టూరిజం వెబ్‌సైట్‌లో ఫోటోలను స్ఫూర్తిగా తీసుకుని రేపర్లపై ముంద్రించాం.. వినియోగదారులు అలాంటి అందమైన డిజైన్‌లను సేకరించడానికి ఇష్టపడతారని మా గత ప్రచారాలు కూడా నిరూపించాయి’ అని నెస్లే ట్విటర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ చాక్లెట్‌ ప్యాక్‌లను తక్షణమే మార్కెట్‌ నుంచి వెనక్కి తెప్పించే చర్యలను ప్రారంభించామని పేర్కొంది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3nIUovC

Post a Comment

0 Comments