నాలుగో డోస్ అవసరం రావొచ్చు.. ఆంథోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు

ఒమిక్రాన్‌ వేరియంట్‌పై పోరాటంలో భాగంగా తమ పౌరులకు టీకా నాలుగో డోసూ వేయాల్సిన అవసరం రావొచ్చని అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌచీ అభిప్రాయపడ్డారు. వయస్సు, వ్యక్తిగత ఆరోగ్య సమస్యల ఆధారంగా ఈ డోసు వేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. నాలుగో డోసు అవసరంపై మీడియా అడిగిన ప్రశ్నలపై ఫౌచీ సమాధానం ఇస్తూ... ఈ అంశాన్ని దగ్గరి నుంచి గమనిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఇంకోసారి మరో బూస్టర్‌ అవసరం ఉండొచ్చని చెప్పారు. ఒమిక్రాన్‌ను ‘ఆందోళనకర వేరియంట్‌’గా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించినప్పటి నుంచి అమెరికాలో సుమారు లక్ష మరణాలు సంభవించడం గమనార్హం. ఈ నేపథ్యంలో నాలుగో డోసుపై ఫౌచీ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. నవంబర్‌లో వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది కరోనాతో మరణించారని ఫౌచీ ఇటీవలే వెల్లడించారు. దీన్ని మహమ్మారి పూర్తిగా విస్తరించిన దశగా ఆయన అభివర్ణించారు. ఆరు నెలల నుంచి 24 నెలల పిల్లలు, అలాగే 21 నెలల నుంచి నాలుగేళ్ల చిన్నారులకు వ్యాక్సినేషన్2పై ఫైజర్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిందని తెలిపారు. ఇదిలా ఉండగా.. వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌ తదితర రాష్ట్రాలు.. మాస్క్ తప్పనిసరి ఆదేశాల ఎత్తివేతకు చర్యలు చేపట్టాయి. అయితే, పాఠశాలల్లో మాస్క్ వినియోగాన్ని కొనసాగించాలన్న సీడీసీ మార్గదర్శకాలకు తాము కట్టుబడి ఉంటామని ప్రభుత్వం ఇటీవలే స్పష్టం చేసింది. వైరస్‌ ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోనూ పౌరులు మాస్క్ ధరించాలని సీడీసీ సూచించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా వరుసగా ఐదో వారం కరోనా మరణాల్లో పెరుగుదల నమోదయ్యింది. గతవారం 68 వేల మంది కరోనాతో చనిపోగా.. అంతకు ముందువారంతో పోల్చితే ఇవి 7 శాతం అధికం. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మరణాలు పెరుగుతున్నాయని, కరోనాపై విజయం సాధించేశామని ఏ దేశమైనా చెప్పుకుంటే అది అవివేకమవుతుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ అన్నారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/SXCGmTL

Post a Comment

0 Comments