లోక్‌సభలో గురువారం మాజీ సహచరులు జ్యోతిరాదిత్య సింధియా, శశిథరూర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో సభ్యులు ఇంగ్లీషులో ప్రశ్నలు అడిగితే కేంద్ర పౌర విమానయాన మంత్రి హిందీలో సమాధానం ఇచ్చారు. దీనిపై ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అవమానించడమేనంటూ మండిపడ్డారు. తమిళనాడుకు చెందిన ఎంపీలు అనుబంధ ప్రశ్నలు అడిగిన సమయంలో ఈ సన్నివేశం నెలకుంది. డీఎంకే ఎంపీలు ఆంగ్లంలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి హిందీలో సమాధానం ఇవ్వగా.. శశిథరూర్ జోక్యం చేసుకున్నారు. మంత్రి ఇంగ్లిషులో మాట్లాడుతారు.. ఆయన ఇంగ్లీషులో సమాధానం ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు. ‘‘దయచేసి హిందీలో బదులివ్వకండి.. ఇది ప్రజలను అవమానించినట్టే’’ అంటూ కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జ్యోతిరాదిత్య సింధియా.. సభ్యులు అలాంటి వ్యాఖ్య చేయడం విచిత్రంగా ఉందని అన్నారు. ‘‘నేను హిందీలో మాట్లాడితే (సభ్యుడికి) అభ్యంతరం ఎందుకు.. సభలో అనువాదకుడు కూడా ఉన్నారని’’ కేంద్ర మంత్రి అన్నారు. ఇరువురి మధ్య మరింత వాగ్వాదం తీవ్రతకు దారితీయకుండా స్పీకర్ వారించారు. స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని హిందీలో సమాధానం ఇవ్వడం అవమానించడం కాదని చెప్పి వివాదాన్ని అంతటితో నిలిపివేశారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/vqfzxwX
0 Comments