సిరియాలో అమెరికా మెరుపుదాడి.. ఐఎస్ చీఫ్ సహ అతడి కుటుంబం హతం

సిరియాలో అమెరికా సైన్యం జరిపిన మెరుపు దాడుల్లో ఐఎస్‌ఐఎస్‌ కీలక నేత హతమయ్యాడు. వాయువ్య సిరియాలో చేపట్టిన ఉగ్రవాద నిరోధక ప్రత్యేక ఆపరేషన్‌ను సైనిక దళాలు విజయవంతంగా పూర్తిచేసినట్లు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వయంగా ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘‘నా ఆదేశాల మేరకు సిరియాలో గతరాత్రి అమెరికా దళాలు చేపట్టిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసింది.. మా సాయుధ దళాల నైపుణ్యం, తెగువకు ధన్యవాదాలు... ఐఎస్‌ నేత అబూ ఇబ్రహీంను తుదముట్టించాం.. ఆ ఆపరేషన్‌ను పూర్తి చేసుకొని అమెరికన్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారు’’ అని జో బైడెన్‌ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌ సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు జాతీయ భద్రతా బృందం సభ్యులు స్వయంగా పర్యవేక్షించినట్లు వైట్‌హౌస్‌ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసింది. టర్కీ సరిహద్దుల్లో పట్టణం అత్మెహ్‌లోని ఓ మూడంతస్తుల భవంతిలో కుటుంబంతో ఉన్న ఐఎస్ నేతను పట్టుకోవాలని అమెరికా సైన్యాలు పలుసార్లు రిహార్సిల్స్ చేశాయి. హెలికాప్టర్ ఆ భవనంపై చక్కర్లు కొట్టాయి. కానీ అతడ్ని అమెరికా సైన్యం చేరుకోకముందే అబూ ఇబ్రహీం అల్-హషిమి అల్-ఖురేషి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. దీంతో అల్ ఖురేషి సహా భవనంలోని ఉన్నవారంతా చనిపోయారు. పేలుడు ధాటికి శరీర భాగాలు తునాతునకలై భవనం నుంచి వీధుల్లోకి వచ్చాయి. హషిమి అల్ ఖురేషిని లొంగిపోవాలంటూ అమెరికా సైన్యం తొలుత హెచ్చరించినట్టు ఓ ప్రత్యక్ష సాక్షి అన్నారు. ‘‘లోపల ఉన్న మహిళలు, పురుషులు, పిల్లలు మీ చేతులు పైకెత్తండి. అమెరికా సంకీర్ణ దళాలు మీ ప్రాంతాన్ని చుట్టుముటాయి.. బయటికి రాకపోతే చచ్చిపోతారు’’ అని హెచ్చరించారు. ఈ క్రమంలో అమెరికా సైన్యం భవనంలోని వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అబూ ఇబ్రహీం అల్-హషిమి అల్-ఖురేషి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. పేలుడు జరగడానికి ముందు భవనం మొదటి అంతస్తులో నలుగురు చిన్నారులు సహా ఆరుగురు ఉన్నట్టు అమెరికా సైన్యాలు గుర్తించాయి. ఊహించిన దానికంటే తీవ్రతతో భారీ పేలుడు చోటుచేసుకుని, మూడో అంతస్తులోని ఉన్న ప్రతి ఒక్కరూ ప్రాణాలు కోల్పోయారు. ఖురేషీ, అతని భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయినట్టు అమెరికా అధికారులు తెలిపారు. అమెరికా దళాలు రెండో అంతస్తుకు చేరుకున్నప్పుడు ఖురేషీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఒకరు, అతడి భార్య కాల్పులు జరపపడంతో సైన్యం అప్రమత్తమయ్యింది. ఎదురుకాల్పుల్లో ఈ ఇద్దరూ, మరో చిన్నారి చనిపోగా.. మరో నలుగురు పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అమెరికా సైన్యం దాడిలో కనీసం 13 మంది చనిపోయారని, వీరిలో మహిళలే అధికంగా ఉన్నారని సిరియా రెస్క్యూ సిబ్బంది తెలిపారు. కాగా, 2019 అక్టోబరులో అమెరికా చేపట్టిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ వ్యవస్థాపకుడు అబూ బకర్‌ అల్‌-బాగ్దాది హతమయ్యాడు. అనంతరం ఐఎస్‌ఐఎస్‌ బాధ్యతలను అబూ ఇబ్రహీం ఖురేషీ చేపట్టాడు. తాజా దాడిలో ఆయన కూడా అంతమయ్యాడు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/Q6OSRc5

Post a Comment

0 Comments