
ఉత్తర్ ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయోధ్య-లక్నో హైవేపై నారాయణపూర్ గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు హైవేపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురుతో సహా ఆరుగురు చనిపోయారు. మృతుల్లో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు అక్కడకు చేరుకుని కారులో ఉన్న ఆరుగురు మృతదేహాలను బయటకు తీశారు. తర్వాత వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అందరూ చనిపోయినట్టు వెల్లడించారు. చనిపోయినవారంతా గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరంతా కలసి ఓ పెళ్లికి హాజరయ్యేందుకు కారులో ఫైజాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఆరా తీస్తున్నారు. దీనికోసం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీలను పరిశీలిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/670JZNl
No comments:
Post a Comment