డిసెంబరులో ప్లాన్ చేసి ఫిబ్రవరిలో అమలు.. ఐఎస్ చీఫ్‌పై దాడికి అమెరికా పక్కా స్కెచ్

సిరియాలోని అధినేత అబు ఇబ్రహీం అల్-బషీద్ అల్ ఖురేషీని పట్టుకోడానికి అమెరికా దళాలు ప్రయత్నించగా... అతడు తనను తాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అయితే, ఈ ఆపరేషన్ కోసం అమెరికా కొన్ని నెలల కిందటే వ్యూహరచన చేసి, పక్కగా అమలు చేసింది. అల్ ఖురేషీ కదలికలపై నిఘా పెట్టి.. టర్కీ సరిహద్దుల్లోని అత్మేహ్ పట్టణంలో అతడు ఉంటున్న ఇంటిని గుర్తించింది. వాస్తవానికి డిసెంబరులోనే ఖురేషిపై దాడి చేయాలని భావించినా సరైన సమయం కోసం ఎదురుచూసింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 3న అమెరికా అధినాయకత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే.. ఓ గుర్తు తెలియని స్థావరం నుంచి ప్రత్యేక కమాండోల దళం, డ్రోన్లు అత్మేహ్‌ వైపు బయలుదేరాయి. గతంలో ఐఎస్ మాజీ చీఫ్ అబూ బకర్‌ అల్‌ బగ్దాదీ ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశానికి కొన్ని మైళ్ల దూరంలోనే ఈ ప్రదేశం ఉండటం గమనార్హం. ఖురేషీపై 10 మిలియన్ డాలర్ల రివార్డును అమెరికా ప్రకటించింది. అతడి ఆచూకీ చెప్పినవారికి ఈ మొత్తాన్ని అందజేస్తామని తెలిపింది. అయితే, అల్‌ బగ్దాదీ మాదిరిగా కాకుండా.. ఖురేషీ బాహ్యప్రపంచానికి అతి తక్కువ సార్లు కనిపించాడు. అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు ఐసిస్ సిద్ధం చేసింది. 2019లో బగ్దాదీ హతమైన నాలుగు రోజుల తర్వాత ఖురేషీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ప్రధాన యుద్ధ క్షేత్రానికి దూరంగా ఉంటూ కేవలం కొరియర్ల ద్వారానే ఐసిస్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. అత్యంత క్రూరుడిగా పేరొందిన ఖురేషీ.. ఐసిస్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన అరబ్‌యేతరుడు కావడం విశేషం. ఇరాక్‌ నియంత సద్దామ్‌ హుస్సేన్‌ సమయంలో సైన్యంలో పనిచేసిన ఖురేషీ.. అతడి శకం ముగియడంతో అల్‌-ఖైదా ఉగ్రవాద సంస్థలో చేరాడు. అయితే, 2003లో అమెరికా సైన్యానికి ఖురేషి చిక్కడంతో క్యాంప్‌ బుక్కా జైల్లో ఉంచింది. అక్కడ పరిచయాలతో ఇస్లామిక్‌ స్టేట్‌ను ఏర్పాటు చేసి.. మోసూల్‌ పట్టణం స్వాధీనం చేసుకోవడానికి అల్‌ బగ్దాదీకి ఖురేషీ సహకరించాడు. ఆ తర్వాత వేగంగా ఎదుగుతూ ఐసిస్‌లో కీలక స్థానానికి చేరుకున్నాడు. బగ్దాదీని వ్యతిరేకించిన వారి పట్ల క్రూరమైన విధానాలను అనుసరించాడు. ఖురేషీ నేతృత్వంలో నరమేధాన్ని చేపట్టిన యాజిదీ తెగ.. మహిళలను చిత్ర హింసలకు గురిచేసి విక్రయించడం, పేలుళ్లకు పాల్పడటం వంటి దారుణాలకు తెగబడింది. అత్మేహ్‌ పట్టణంలో ఓ మూడంతస్తుల భవనంలో ఖురేషీ నివాసం ఉంటున్నట్టు అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. కానీ, ఖురేషీ మాత్రం అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవాడు. అదే భవనంలో కింది అంతస్తులో ఉండే ఒక ఐసిస్‌ నేత సాయంతో కేడర్‌కు దిశానిర్దేశం చేసేవాడు. కొన్నిసార్లు మూడో అంతస్తులో ఆరుబయట స్నానం చేసేవాడు. ఈ నేపథ్యంలో భవనంపై వైమానిక దాడి చేస్తే అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాదు, ఆ భవనంలో ఉన్న ఇరుగు పొరుగువారికి ఖురేషీ ఐసిస్‌ చీఫ్‌ అన్న విషయం కూడా తెలియదు. దీంతో కమాండోల సాయంతో ఆపరేషన్‌ నిర్వహించాలని నిశ్చయించారు. ఇందుకు ఓ ఇంటిని కృత్రిమంగా నిర్మించి పేలుళ్లలో ఈ ఇల్లు ఏస్థాయిలో దెబ్బతింటుందో అంచనావేశారు. అమెరికా అధ్యక్షుడు ఓ బైడెన్‌కు ఈ ఆపరేషన్ గురించి డిసెంబరులో క్షుణ్ణంగా వివరించిన అధికారులు.. అనుమతి కోసం ఎదురుచూశారు. గురువారం బైడెన్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంతో గుర్తుతెలియని స్థావరం నుంచి గన్‌షిప్‌ హెలికాప్టర్లు, డ్రోన్లు , కమాండోలు రాత్రి 10 గంటల సమయంలో అత్మేహ్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో అమెరికా కమాండోలకు కొంత ప్రతిఘటన ఎదురైనా వారిని అణచివేసి ముందుకు కదిలారు. ఖురేషీ ఉంటున్న భవనం కింద అంతస్తు నుంచి 10మందిని ప్రాణాలతో రక్షించారు. అమెరికా సైన్యం దాడి మొదలైన వెంటనే మూడో ఫ్లోర్‌లో ఉన్న అల్ ఖురేషి ఆత్మాహుతి జాకెట్‌తో పేల్చేసుకొన్నాడు. ఇక అమెరికా దళాలు రెండో ఫ్లోర్‌లో ఉంటున్న ఖురేషీ అనుచరుడు, అతని భార్యను మట్టుబెట్టాయి. పేలుడు అనంతరం వేలిముద్రలు, డీఎన్ఏ ఆధారంగా ఖురేషీని నిర్ధారించారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/zw81ZkF

Post a Comment

0 Comments