అసోం జూలో రెండు కూనలకు జన్మనిచ్చిన రాయల్ బెంగాల్ టైగర్‌

గౌహతిలోని అసోం స్టేట్ జూ కమ్ బొటానికల్ గార్డెన్‌లో ఖాజీ అనే రాయల్ బెంగాల్ టైగర్ రెండు కూనలకు జన్మనిచ్చింది. ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన రెండు పిల్లలకు జ‌న్మ‌నిచ్చిన‌ట్టు జూ అధికారులు వెల్లడించారు. పులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని, వాటిని చలి నుంచి రక్షించేందుకు పంజరం వెలుపల హీటర్లు పెట్టినట్టు అసోం రాష్ట్ర జంతు ప్రదర్శనశాల డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ డాక్టర్ అశ్విని కుమార్ చెప్పారు. అసోం జూలో తల్లి పులికి పౌష్టికాహారంతో పాటు ఏడు కిలోల మాంసాన్ని ఇస్తున్నామని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ అమిత్ షాహి తెలియజేశారు. జూలో జంతువులు పరిశుభ్రమైన వాతావరణంలో ఉండేలా చూసుకుంటున్నామని తెలిపారు. ఈ రెండు పులి పిల్ల‌ల‌కు త్వ‌ర‌లోనే పేర్లు పెట్టనున్నారు. ఇప్పటికే ఈ పిల్లలకు పేర్లు పెట్టాల్సిందిగా అటవీ శాఖ మంత్రి పరిమళ శుక్లా బాయిద్యను అటవీ శాఖ అధికారులు కోరారు. ఆయన గతంలో కూడా పలు జంతువులకు పేరు పెట్టారు. కాగా కొత్తగా పుట్టిన పిల్లలతో కలిపి జూలో బెంగాల్ పులుల సంఖ్య 9కి చేరింది. ఇంతకు ముందు ఖాజీ 2020 ఆగస్టు నెలలో సురేశ్, సుల్తాన్ అనే పులి పిల్లలకు జన్మనిచ్చింది. అంటే రెండేళ్లలో ఖాజీ నాలుగు పులి పిల్లలను కనింది. అలాగే అసోంలో పులుల సంఖ్య పెరిగింది. 2018లో 159 పులులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య రెండు వందలకు చేరింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3yUJ0D4

Post a Comment

0 Comments