కేరళలోని పాలక్కడ జిల్లా సమీప కొండ చీలికలో గత రెండు రోజులుగా చిక్కుకున్న 23 ఏళ్ల యువకుడు బాబును సైన్యం రక్షించింది. గత సోమవారం మిత్రులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన బాబు.. ప్రమాదవశాత్తూ జారిపడి చీలికలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆహార పానీయాలు లేకుండా గత మూడు రోజులుగా అక్కడే ఉండిపోయాయి. సోమవారం సాయంత్రం నుంచి సహాయక బృందం చేసిన ప్రయత్నాలు బుధవారం ఉదయ ఫలించాయి. కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్ రంగంలోకి దిగి అతడ్ని కాపాడే ప్రయత్నం చేసింది. యువకుడ్ని రక్షించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైన్యం సాయం కోరడంతో బెంగళూరు నుంచి ఓ ప్రత్యేకదళం మలప్పుజకు చేరుకుంది. బుధవారం ఉదయం 5.45 నిమిషాలకు ఆపరేషన్ ప్రారంభించింది. డ్రోన్ల సాయంతో యువకుడు చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించారు. వెల్లింగ్టన్‌లోని సూలూరు ఎయిర్‌బేస్ నుంచి హెలికాప్టర్లను రప్పించారు. సహాయకచర్యల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పారా కమాండోలు సైతం పాల్గొన్నారు. కొండ నడుమలో గూడు లాంటి చోట కూర్చొన్న యువకుడ్ని నాలుగు గంటల పాటు శ్రమించి ఉదయం 10.30 గంటలకు సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. సోమవారం మరో ఇద్దరు మిత్రులతో కలిసి కొండ శిఖరం ఎక్కేందుకు బాబు ప్రయత్నం చేశాడు. మిగతా ఇద్దరూ మధ్యలోనే విరమించుకున్నా.. అతడు మాత్రం విజయవంతంగా కొండ శిఖరం చేరుకున్నాడు. ఇదే సమయంలో ఉన్నట్టుండి కిందికి జారిపడి మధ్యలో ఇరుక్కున్నాడు. భూమి నుంచి 500 మీటర్ల ఎత్తులో చిక్కుకున్న యువకుడు.. తన మొబైల్ ఫోన్ ద్వారా ఫోటోలను షేర్ చేశాడు. ఆ రోజంతా కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్ ప్రయత్నించినా ఆ చీలిక వద్దకు వెళ్లలేకపోయింది. మూడు రోజుల అనంతరం సైన్యం చేపట్టిన ఆపరేషన్ విజయవంతమయ్యింది. అయితే, యువకుడు ఆరోగ్యంగానే ఉన్నాడని అధికారులు తెలిపారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/MPnqwS3
0 Comments