Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 22 February 2022

Russia Invasion రష్యాపై ఆంక్షల కొరడా.. ఆరంభం మాత్రమేనంటూ హెచ్చరికలు

ఉక్రెయిన్‌‌ను మూడు ముక్కలు చేసిన రష్యా.. డొనెట్స్క్‌, లుహాన్స్క్‌లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించింది. అంతేకాదు, శాంతిస్థాపన పేరుతో తన బలగాలను రష్యా పంపుతుండటంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రష్యా వైఖరిని నిరసిస్తూ ఆంక్షల కొరడాను ఝళిపించి, ఆ దేశాన్ని ఆర్థికంగా, వాణిజ్యపరంగా ఏకాకిని చేసే చర్యలు ముమ్మరం చేశాయి. డొనెట్స్క్‌, లుహాన్స్క్‌లతో తమ దేశ పౌరులు, సంస్థలు ఎలాంటి వాణిజ్య సంబంధాలు నెరపకుండా అమెరికా నిషేధం విధించింది. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్‌ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసినట్లు వైట్‌హౌస్ తెలిపింది. ఉక్రెయిన్‌ విషయంలో రష్యా తీరును మార్చుకోకుంటే మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సరిహద్దులు దాటి సైన్యాన్ని లోపలికి పంపేందుకు రష్యా సిద్ధమైనప్పటికీ యుద్ధాన్ని నివారించడానికి ఇంకా సమయం ఉందని అమెరికా అధ్యక్షుడు అన్నారు. ఈ విషయంలో రష్యా పునరాలోచించాలని సూచించారు. తాజా ఆంక్షలు ఆరంభం మాత్రమేనని, పరిస్థితి మారకుంటే మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కానీ రష్యా దండయాత్రను నివారించడానికి దౌత్యపరంగా చివరి ప్రయత్నానికి తలుపులు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘ విషయంలో ఎటువంటి సందేహం లేదు, కాబట్టి మేము ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి నిశితంగా గమనిస్తున్నాం.. అయినప్పటికీ, కోట్లాది మంది ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విపత్తును నివారించడానికి ఇంకా సమయం ఉంది’’ అని బైడెన్ స్పష్టం చేశారు. అటు, బ్రిటన్ సైతం రష్యాకు చెందిన 5 ప్రముఖ బ్యాంకులు, ముగ్గురు సంపన్నుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. జర్మనీ కూడా రష్యాకు వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి సహజ వాయువు సరఫరాకు ఉద్దేశించిన ‘నార్డ్‌ స్ట్రీమ్‌ 2’ గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ‘నార్డ్‌ స్ట్రీమ్‌ 2’ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు ధ్రువీకరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి డొనెట్స్క్‌, లుహాన్స్క్‌లను స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించిన రష్యా వైఖరికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ షోల్స్‌ తెలిపారు. అటు, ఐరోపా సమాఖ్యలోని 27 దేశాలు రష్యా అధికారులపై ఆంక్షల అమలుకు మంగళవారం ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. డొనెట్స్క్‌, లుహాన్స్క్‌లలోకి దళాలను పంపే నిర్ణయానికి ఆమోదం తెలిపిన రష్యా పార్లమెంట్ సభ్యులు, అధికారులపై ఆంక్షలు విధించినట్లు ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి జీన్‌-వెస్‌ లెడ్రియన్‌ తెలిపారు. ఈయూ సభ్య దేశాలతో రష్యా ఆర్థిక కార్యకలాపాలపైనా ఆంక్షలు విధించినట్లు ఐరోపా సమాఖ్య విదేశీ విధానాల బాధ్యులు జోసెప్‌ బొరెల్‌ చెప్పారు. ఇవి తొలి దశ ఆంక్షలే అని, మున్ముందు మరిన్ని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రష్యా విషయంలో మరికొన్ని దేశాలు ఇదే దారిలో పయనించనున్నాయి.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/OD9XTSz

No comments:

Post a Comment