Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 26 February 2021

ప్రతిష్ఠకు భంగం కలిగించడం మానసిక క్రూరత్వమే.. విడాకుల కేసులో సుప్రీం సంచలన తీర్పు

భార్యాభర్తల విడాకుల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. భార్యభర్తల్లో ఎవరి ప్రతిష్ఠకు భంగం కలిగించినా విడాకులు తీసుకోవచ్చని శుక్రవారం తీర్పు చెప్పింది. మానసిక వేధింపులతోపాటు సమాజంలో తన ప్రతిష్ఠకు భంగం కలిగించిన భార్య నుంచి విడాకులు ఇప్పించాలంటూ ఓ ఆర్మీ అధికారి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. భార్యాభర్తల విడాకుల విషయంలో ఉత్తరాఖండ్ హైకోర్టు తప్పిదం చేసిందని వ్యాఖ్యానించారు. ‘ఇది అప్పీలుదారుపై ప్రతివాది క్రూరత్వానికి సంబంధించిన ఖచ్చితమైన కేసు.. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి, కుటుంబ న్యాయస్థానం ఉత్తర్వులను పునరుద్ధరించడానికి సహేతుక కారణాలు ఉన్నాయని పరిశీలనలో గుర్తించాం’ అని అన్నారు. బాధితుడు తన వివాహాన్ని రద్దు చేసుకోడానికి అన్ని రకాలుగా అర్హుడు.. కాబట్టి భార్య పిటిషన్ కొట్టివేసి, దానికి అనుగుణంగా ఆదేశాలు జారీచేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌‌కు చెందిన ఆర్మీ అధికారి ప్రస్తుతం ప్రభుత్వ పీజీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఈయనకు 2006లో వివాహం జరగ్గా.. భార్యభర్తలు కొద్ది నెలలు కలిసున్నారు. అనంతరం విభేదాలు రావడంతో 2007 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ సమయంలో తన ప్రతిష్ఠకు భంగం కలిగించిన భార్య నుంచి విడాకులు మంజూరు చేయాలని ఆయన తొలుత కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ ఆయనకు అనుకూలంగా విడాకులు మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును అధికారి భార్య హైకోర్టులో సవాల్ చేశారు. తాను విడాకులు కోరుకోవడంలేదని, వైవాహిక జీవితాన్ని పునరుద్దరించాలని కోరింది. హైకోర్టు ఆమె వాదనలను సమర్ధించి, విడాకులను రద్దుచేసింది. దీంతో ఆ అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ వేశారు. విచారణ జరిపిన జిస్టస్‌ ఎస్‌.కె.కౌల్‌ ధర్మాసనం విడాకులు మంజూరు చేసింది. భార్యభర్తలు విడాకుల విషయంలో సహేతుక కారణాలను పరిశీలించి, ఓర్పు, సహనం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాం.. వివాహం రద్దు చేయడానికి బాధితులు చేసిన ఆరోపణలు తీవ్రత సరిపోతుందా అని నిర్ధారించడానికి కోర్టు నేపథ్యం, విద్యా స్థాయి, వారి స్థితిని దృష్టిలో ఉంచుకోవాలి’ అని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘జీవిత భాగస్వామి మానసికంగా హింసించారనే ఆరోపణలను విడాకులు మంజూరుకు పరిగణనలోకి తీసుకున్నందుకు, అలాంటి జంట వైవాహిక జీవితం కొనసాగడం సాధ్యం కాదు’ అని కోర్టు వివరించింది. ఉన్నత విద్యావంతులు ఈ ఆరోపణలు చేయడం, అప్పీలుదారుడి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉంది.. జీవిత భాగస్వామి పేరు ప్రతిష్ఠలను అతని సహచరులు, ఉన్నతాధికారులు, సమాజం ముందు దెబ్బతీసినప్పుడు, బాధితుడు అటువంటి ప్రవర్తనకు క్షమాపణలు ఆశించడం కష్టం’అని తెలిపింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3dX4SDT

No comments:

Post a Comment