Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 20 July 2019

ఉత్తరాదిని ముంచెత్తుతున్న వరదలు.. అసోం, బిహార్‌లో 159కి చేరిన మృతులు

ఉత్తరాదిలోని బిహార్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాలను వరదలు వణికిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 159కి చేరుకుంది. అసోంలో శనివారం మరో 12 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు వరదల వల్ల చనిపోయినవారి సంఖ్య 62కు చేరింది. కజిరంగా వన్యప్రాణి జాతీయ పార్కులో వరద నీరు కాస్త తగ్గుముఖం పట్టింది. వరదల ఉద్ధృతికి సుమారు 129 వన్యప్రాణులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న 2 ఖడ్గమృగాలు, ఒక ఏనుగును అటవీశాఖ అధికారులు రక్షించారు. ఇక, బిహార్‌లో శనివారం మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 97కి పెరిగింది. సీతామర్హి జిల్లాలో అత్యధికంగా 27 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కోటి 15 లక్షల మందిని వరదలు ప్రభావితం చేశాయి. బిహార్‌లోని మొత్తం 12 జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకోగా, మొత్తం 66.76 లక్షల మందిపై ప్రభావితమయ్యారు. నవాడ జిల్లాలో పిడుగుపాటుకు ఓ యువకుడు సహా 15 ఏళ్లలోపు చిన్నారులు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అసోంలో వర్షాలు తగ్గుముఖం పట్టినా ఇంకా వరద గుప్పిట్లోనే జనం చిక్కుకున్నారు. ఇక్కడ మొత్తం 3,705 గ్రామాల్లోని 49 లక్షల మంది ముంపుబారిన పడ్డారు. పంజాబ్‌, హరియాణాలలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్‌లోని ఏడు జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉంది. పాటియాలా, మోగ, మన్సా, సంగ్రూర్‌, ఫరీద్‌కోట్‌, బఠిండా తదితర ప్రాంతాల్లో ఘగ్గర్‌ నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీని పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ చెదురుమదురుగా వానలు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. పశ్చిమ రాజస్థాన్‌లోని ప్రాంతానికి విస్తరించాయి. ఉత్తరాదిలో ఢిల్లీ మినహా అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. బిహార్‌లో వరద బాధితులకు నేరుగా నగదు జమచేసే చర్యలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శ్రీకారం చుట్టారు. మరోవైపు, కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇడుక్కి డ్యామ్ ప్రమాదకరస్థాయికి చేరుకుంది. పంబా నది ఉగ్రరూపం దాల్చింది. శనివారం అత్యధికంగా ఇడుక్కి జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2M4zKnG

No comments:

Post a Comment