
కేంద్ర విదేశాంగ మాజీ మంత్రి కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో హార్ట్ అటాక్ రావడంతో ఆమెను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. హాస్పిటల్లో చేర్పించే సమయానికి ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో.. ఐదుగురు డాక్టర్ల బృందం ఆమెకు చికిత్స అందించింది. ఆమెను బతికించే ప్రయత్నాలేవి ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో మంగళవారం రాత్రి ఆమె తుది శ్వాస విడిచారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ విభజన బిల్లుకు పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రికి ధన్యవాదాలు చెబుతూ ఆమె ట్వీట్ చేశారు. ఇది చూడటం కోసమే జీవితకాలం ఎదురు చూశానని ఆమె ట్వీట్ చేశారు. ఇదే ఆమె చేసిన చివరి ట్వీట్. ప్రధాని మోదీ తొలి కేబినెట్లో ఆమె విదేశాంగ మంత్రిగా పని చేశారు. ఇందిరా గాంధీ తర్వాత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రెండో మహిళగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. 1998లో కొద్ది రోజులపాటు ఢిల్లీ సీఎంగానూ ఆమె పని చేశారు. మోదీ కేబినెట్లో విదేశాంగ మంత్రిగా ఆమె విశేష సేవలు అందించారు. ఆ పదవికి ఆమె వన్నె తీసుకొచ్చారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి వెనక్కి రప్పించడంలో, పాకిస్థానీయులకు మెడికల్ వీసాలు అందజేయడంలో ఆమె చొరవ చూపారు. నిత్యం ట్విట్టర్లో అందుబాటులో ఉంటూ.. సామాన్యుడి మంత్రిగా అనిపించుకున్నారు. పార్టీలకు అతీతంగా ఆమె వ్యవహరించారు. 1953, ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలాలో సుష్మా స్వరాజ్ జన్మించారు. 1973లో సుప్రీం కోర్ట్ లాయర్‌గా కెరీర్ ప్రారంభించారు. 1970ల్లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. 1977లో హర్యానా కేబినెట్ మంత్రిగా ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా ఆమె గుర్తింపు పొందారు. మోదీ కేబినెట్లో పని చేస్తున్న సమయంలోనే సుష్మ స్వరాజ్ కిడ్నీల పనితీరు దెబ్బతింది. దీంతో ఆమెకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. ఆరోగ్య సంబంధ సమస్యల కారణంగా ఆమె 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. తెలంగాణతోనూ ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆమె పార్లమెంట్‌లో తెలంగా గొంతుకను బలంగా వినిపించారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆమెను తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకుంటారు. 2017 చివర్లో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో మాట్లాడిన ఆమె.. ‘‘నేను మీ తెలంగాణ చిన్నమ్మను’’ అనగానే.. సభ చప్పట్లతో మార్మోగింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YA8aXf
No comments:
Post a Comment