Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 6 December 2020

మళ్లీ భారత్‌కు దగ్గరవుతున్నా.. ఆ విషయంలో వెనక్కు తగ్గని నేపాల్!

కాలాపానీ వివాదంపై నేపాల్ వెనక్కు తగ్గే సూచనలు కనిపించడంలేదు. భారత్ భూభాగంలోని కాలాపానీ, లిపులేఖ, లింపుయాధురాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ కొత్త మ్యాప్‌ను రూపొందించి, ఆమోదం తెలపడంతో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో చైనాకు దగ్గరయిన నేపాల్.. ఒక దశలో భారత్‌తో చారిత్రక సంబంధాలను వదులుకోడానికి వెనుకాడలేదు. కొద్దిరోజులుగా ఇరు దేశాల మధ్య కొనసాగిన ప్రతిష్టంభన క్రమంగా తొలగిపోతుంది. భారత విదేశాంగ శాఖ అధికారులు నేపాల్‌లో ఇటీవల పర్యటించి, వివాదాలపై చర్చించారు. భారత్‌‌ను రెచ్చగొట్టేలా వ్యవహరించిన నేపాల్ ప్రధాని వైఖరిలోనూ స్పష్టమైన మార్పు వచ్చింది. ఇరు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపుయాధురాపై చర్చలు ప్రారంభించారు. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గయావలి ఈ నెలలో భారత్ పర్యటనకు విచ్చేయనున్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు సంక్లిష్టంగా ఉన్న నేపథ్యంలో నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, కాలాపానీ వివాదంపై నేపాల్ వైఖరిలో మార్పు ఉండబోదని సంకేతాలు వెలువడ్డాయి. 2019-20 సంవత్సరానికి సంబంధించిన విదేశీ వ్యవహారాల నివేదికలో కొత్త పరిపాలనా, రాజకీయ మ్యాప్ జారీ చేయాలనే నిర్ణయాన్ని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమర్థించింది. ‘కాలాపానీ, లింపియాధురా, లిపులేఖ్ నేపాల్ భూభాగాలు.. నిర్మాణాత్మక చర్చలు, సంభాషణల ద్వారా, ‘చారిత్రక ఒప్పందం, సాక్ష్యాలు, వాస్తవాలు’ ఆధారంగా సరిహద్దు సమస్య త్వరలో పరిష్కారమవుతుందని తాను విశ్వసిస్తున్నాను’అని నివేదికపై గయావాలి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తో జరిగే ఆరో సంయుక్త కమిషన్ సమావేశం కోసం నేపాల్ మంత్రి ప్రదీప్ గయావలి భారత్ పర్యటకు వస్తున్నారు. భారత్ రావాలని ఇటీవల నేపాల్‌లో పర్యటించిన భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ శ్రింగ్లా ఆహ్వానించారు. సుస్తా, వాయువ్య ప్రాంతాలు మినహా అన్ని విభాగాలలో నేపాల్-ఇండియా సరిహద్దు పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నేపాల్ నిరంతరం నొక్కి చెబుతోంది. సుగౌలి ఒప్పందంలోని ఆర్టికల్ 5 ప్రకారం.. కాళీ నది తీర్పు ప్రాంతం తమదేనని నేపాల్ చెబుతోంది. ‘సరిహద్దు వివాదాలకు ముగింపు పలకడానికి మ్యాప్‌ను సరిచేయాలని భారత్‌ను నేపాల్ అభ్యర్థించింది.. విదేశాంగ కార్యదర్శి స్థాయిలో చర్చలు జరపాలని రెండుసార్లు ప్రతిపాదించింది’ అని నివేదిక తెలిపింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3osv8rA

No comments:

Post a Comment