కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి రాత్రిపూట కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌లు అంతగా ప్రభావం చూపవని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష్‌వర్దన్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నిర్వహించిన టైమ్స్ నెట్‌వర్క్ ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్‌లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్లే దేశంలో కోవిడ్ రెండో దశ వ్యాప్తిని తగ్గించగలమని అన్నారు. భౌతికదూరం పాటించడం అనేది కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు బలమైన ఆయుధమని అన్నారు. పాక్షిక లాక్‌డౌన్‌లు, రాత్రిపూట కర్ఫ్యూలు లేదా వారాంతపు లాక్‌డౌన్‌ల వల్ల ప్రయోజనం ఉండదని, మహమ్మారి వ్యాప్తిని పెద్దగా అడ్డుకోలేవని అన్నారు. అన్ని వయసుల వారికీ వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం క్రమంగా విస్తరిస్తుందని ఆయన తెలిపారు. కానీ, మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్న వ్యక్తులు, అధిక ముప్పు ఉన్నవారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అందరికీ వ్యాక్సిన్‌కు సంబంధించిన అంశంపై ప్రభుత్వం నిరంతరాయంగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి శాస్త్రీయంగా భారత్ ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. తొలి కేసు నమోదయినప్పటి నుంచి మహమ్మారి ప్రభావం గురించి శాస్త్రీయ ఆధారాలతో కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. కరోనా కట్టడిలో భారత్ అనుసరిస్తోన్న వ్యూహాలకు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయని వ్యాఖ్యానించారు. వైరస్ స్వభావంలో ఏవైనా మార్పులను గుర్తించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్‌ను భారత్ ఉపయోగిస్తోందని అన్నారు. అయినప్పటికీ, ముందస్తు, సరైన విధానం అనుసరిస్తున్నా రెండోసారి వ్యాప్తి అనివార్యమని ఆయన చెప్పారు. ‘చారిత్రాత్మకంగా మహమ్మారులు వ్యాప్తి దశలుగా ఉంటుంది.. కోవిడ్ దీనికి మినహాయింపు కాదు.. యూరప్, అమెరికాలలో సెకెండ్ వేవ్ సమయంలో ఇదే జరిగింది’ అని పేర్కొన్నారు. అయితే, కోవిడ్ ముప్పు, సవాల్‌ను ఎదుర్కొడానికి భారత్ సంసిద్ధంగా ఉందని తెలిపారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/31o6ij3
No comments:
Post a Comment