Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 24 March 2021

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు.. ఆ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే కీలక బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళన మధ్య ఈ బిల్లు ఆమోదం పొందింది. ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అని నిర్వచించే ‘ది గవర్న్‌మెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ (సవరణ) బిల్లు -2021’ మార్చి 22న లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. రాజ్యసభలోనూ ఆమోంద పొందడంతో ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లనుంది. తాజా బిల్లు ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును ఢిల్లీలోని సర్కారు సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యసభలో బుధవారం నాడు ఈ బిల్లుపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టిన విపక్షాలు.. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని డిమాండ్‌ చేశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ బీజేడీ, సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్ఆర్సీపీ సహా పలు విపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. బిల్లుపై డివిజన్ ఓటింగ్ నిర్వహించడంతో అనుకూలంగా 83, వ్యతిరేకంగా 45 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు ఆమోదం పొందినట్టు ఛైర్మన్ ప్రకటించారు. ఈ బిల్లుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. మహా భారతంలో ద్రౌపదికి జరిగిందే.. ఇవాళ భారత రాజ్యాంగానికి జరిగిందని ఆప్ నేత సంజయ్‌ సింగ్‌ విమర్శించారు. రెండు కోట్ల మంది ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన తప్పేంటని ఆయన ప్రశ్నించారు. స్కూళ్లు తెరవడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం, మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటుచేయడమే తాము చేసిన తప్పా? అని నిలదీశారు. ఢిల్లీ సీఎం ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘జీఎన్‌సీటీడీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.. ఇది భారత ప్రజాస్వామ్యానికి దుర్దినం.. ప్రజలకు తిరిగి శక్తిని పునరుద్ధరించడానికి మా పోరాటాన్ని కొనసాగిస్తాం.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మంచి పనులు ఆగవు.. ఎవరూ మా పనులను అడ్డుకోలేరు’ అని అన్నారు. ఈ బిల్లు ద్వారా తమ అధికారాలు హరిస్తున్నారంటూ ఆప్‌ వ్యతిరేకిస్తుండగా.. పాలన వ్యవహారాల్లో నెలకొన్న అస్పష్టతను తొలగించేందుకు దీనిని తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3tX0ZDF

No comments:

Post a Comment